హైదరాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని విషాదంలో ముంచింది. ఈ దుర్ఘటన చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌ల మధ్య ఈరోజు తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో జరిగింది.
రైల్వే ట్రాక్‌పై మృతదేహాలను గమనించిన గూడ్స్ రైలు లోకో పైలట్ వెంటనే వాకీటాకీ ద్వారా అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతులను బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయశాంతి (38), ఆమె కుమార్తె చేతన రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించారు. ఈ ముగ్గురూ రైలు కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో విజయశాంతి తన ఇద్దరు పిల్లలతో బోడుప్పల్‌లో నివసిస్తుండగా, ఆమె భర్త సురేందర్ రెడ్డి ఉపాధి నిమిత్తం నెల్లూరులో ఉంటున్నట్లు వెల్లడైంది. చేతన రెడ్డి ఇంటర్ రెండో సంవత్సరం, విశాల్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారని సమాచారం. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత సమస్యల నేపథ్యంలోనే ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ కలిచివేసింది.
