మన రోజువారీ జీవితంలో ఫోన్ ఒక వ్యసనంగా మారింది. పని సమయంలో, ప్రయాణాల్లో, విశ్రాంతి సమయంలో, నిద్రకు ముందూ కూడా. ఇలా చాలామంది ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తూనే ఉంటారు. అయితే ఇలా ఎక్కువ సేపు స్క్రీన్కు టైం కేటాయించడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు, ఆకలి సంకేతాలు, రక్తంలో చక్కెర స్థిరత్వంపై ప్రభావం చూపుతాయని చాలామందికి తెలియదు.
శరీరం కదలకుండా ఉండేప్పుడు, కండరాలకు గ్లూకోజ్ అవసరం తగ్గిపోతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరగవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువసేపు కూర్చునే వారిలో అలసట, తరచు తిండి కోరికలు, నెమ్మదైన మెటబాలిజం వంటి సమస్యలు పెరుగుతాయి .ఇవన్నీ చక్కెర నియంత్రణను కష్టతరం చేస్తాయి.
స్క్రీన్ టైమ్ తగ్గించడం నిజంగా చక్కెర నియంత్రణకు సహాయపడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే స్క్రీన్ టైం తగ్గించడం వల్ల శారీరక చలనం పెరుగుతుంది. నిద్ర మెరుగవుతుంది అని చెబుతున్నారు నిపుణులు. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు చిన్న చిన్న బ్రేక్‌లు తీసుకోవడం, నడకలు లేదా స్ట్రెచింగ్ చేయడం ద్వారా కండరాలు గ్లూకోజ్‌ను ఎక్కువగా వినియోగిస్తాయి. నిద్రకు ముందు స్క్రీన్లను దూరంగా ఉంచడం ఆకలి, శక్తి హార్మోన్లను నియంత్రించి, మరుసటి రోజు చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచుతుంది.
ప్రతి 45–60 నిమిషాలకు ఒకసారి నిలబడేలా రిమైండర్ పెట్టుకోవడం.. భోజనం సమయంలో ఫోన్/టీవీ దూరంగా పెట్టి, శ్రద్ధగా తినడం మంచిదని సూచిస్తున్నారు. స్క్రీన్‌ను ఎక్కువసేపు ఉపయోగించిన తర్వాత కొద్దిసేపు నడక, స్ట్రెచింగ్ లేదా శ్వాస వ్యాయామం చేయాలని చెబుతున్నారు.
