అన్నాడీకేం అధినేత్రి హోదాలో.. తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జయలలిత క్రమంగా తన బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టుగా ఉంది. ఆస్తుల కేసులో దోషిగా నిర్ధారణ అయ్యి..
పదవిని కోల్పోయిన ఆమె.. ఇటీవలే తిరిగి పదవిని అధిష్టించిన విషయం తెలిసిందే. శ్రీరంగం నుంచి ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడటంతో తిరిగి చెన్నైలోని ఆర్కే నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించింది అన్నాడీఎంకే అధినేత్రి.
మరి ఈ ముచ్చటంతా ముగిసి కొన్ని రోజులే అయినా.. జయలలిత ఇప్పుడు క్రమంగా తన బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టుగా తెలుస్తోంది. ఆమె తన బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి, ఆమెకు అత్యంత విధేయుడు అయిన పన్నీరు సెల్వంకు అప్పజెప్పుతోంది. జయలలిత జైలు పాలైన సందర్భంలో పన్నీరు సెల్వం అన్నాడీఎంకే తరపున ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే జయలలిత జైలు నుంచి తిరిగి రాగానే.. ఆమె కు పదవిని అప్పజెప్పి ఆయన తప్పుకొన్నాడు.
తాజా అప్ డేట్ ఏమిటంటే.. పన్నీరు సెల్వం అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా నియమితం అయ్యాడు. సాధారణంగా ముఖ్యమంత్రులే శానససభా పక్షనేతలుగా ఉంటారు. అయితే జయలలితకు ఆరోగ్యం ఏ మాత్రం సరిగాలేదు. ఈ నేపథ్యంలో ఆమె సభకు హాజరు అయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో సెల్వంకు శాసనసభా పక్షనేత బాధ్యతలను అప్పగించినట్టుగా తెలుస్తోంది. మరి దీన్ని బట్టి క్రమంగా జయలలిత తన బాధ్యతల నుంచి తప్పుకొనేలాగా ఉంది. ప్రస్తుతానికి జైలు భయం లేకపోయినా.. ఆమెకు పదవులను నిలుపుకొనే అర్హత మాత్రం లేకుండా పోయినట్టుగా ఉంది.
