తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలో ఐటీ రంగంలో కొత్త పుంతలు తొక్కించడానికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ కు ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగే వార్షిక సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం పంపింది. ఫిబ్రవరి 6, 7 తేదిల్లో నిర్వహించబోతున్న ఇండియా కాన్ఫరెన్స్ కు హాజరు కావాలని కోరింది. ఈ మేరకు హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ ప్రతినిధులు మంత్రిని కలిసి సదస్సుకు హాజరు కావాలని కోరింది.
వివిధ దేశాలకు చెందిన వెయ్యి మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్న ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడనున్నారు.అమెరికాలోని బోస్టన్ నగరంలో గల హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ కెన్నడీ స్కూల్ కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. భారతదేశం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో పరివర్తనలో భారత్ అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డిజిటల్ ఇండియాపై హార్వర్డ్ కెన్నడీ స్కూల్ చర్చను చేపట్టనుంది.హార్వర్డ్ ఆహ్వానంపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఆనందాన్ని వ్యక్తం చేసారు. హార్వర్డ్ సదస్సుకు హాజరవుతానని చెప్పిన ఆయన సాంకేతిక ఫలాలను పజలకు చేర్చడంలో ప్రభుత్వాల పాత్రపై ప్రసంగించనున్నట్లు చెప్పారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీ హబ్ ద్వారా ప్రభుత్వాలు నూతన ఆవిష్కరణలు ఎలా చేయవచ్చో ఈ సదస్సులో ప్రస్తావించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
భారత్ లోని స్థితిగతులపై చర్చించే ఈ సమావేశానికి ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వాధికారులు, దాతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ తెలంగాణలోని వ్యాపార అవకాశాలపై పలువురు వ్యాపార, పారిశ్రామిక వేత్తలతో సమవేశం కానున్నట్లు తెలుస్తోంది.
