అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు గమనిస్తే.. వద్దనుకున్నా కూడా గతం గుర్తుకు వస్తూ ఉంటుంది. రాష్ట్రపతి భవన్ లో నిన్న (నవంబర్ 25, బుధవారం).. గురునానక్ జయంతి సందర్భంగా జరిగిన వేడుకలు చూసిన కొందరికి ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ ఈవెంట్ కు హాజరైన ప్రధాని నరేంద్రమోడీని చూసిన చాలా మంది గతం గుర్తు చేసుకున్నారు.
విపక్ష నేతలు మోడీని గమనించారో లేదో అని చర్చించుకున్నారు. ఎందుకని ఆరా తీస్తే.. ఓ ఆసక్తికర విషయం తెలిసింది. 2011 సెప్టెంబర్ లో.. గుజరాత్ సీఎంగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ.. బీజేపీ తరఫున సద్భావన యాత్రలో బిజీగా ఉన్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లిం మత పెద్ద ఒకరు.. వారి సంప్రదాయం ప్రకారం టోపీ పెట్టుకోవాలని మోడీని కోరారు. ఆ విజ్ఞప్తిని మోడీ తిరస్కరించడం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.
ఇప్పుడిదంతా ఎందుకు అంటే.. రాష్ట్రపతి భవన్ లో గురునానక్ జయంతికి హాజరైన ప్రధాని మోడీ.. సిక్కుల సంప్రదాయం ప్రకారం తల పాగా ధరించారు. ఇలా తలపాగాతో మోడీని చూసిన కొందరు.. 2011 నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భాన్ని కాంగ్రెస్ నేతలు, బీజేపీ వ్యతిరేకులు చూశారో లేదో అని గుసగుసలాడుకున్నారు.
