పేరుకు మిత్రపక్షాలే కానీ టీడీపీ – బీజేపీ ల మధ్య అసలు సయోధ్య ఉండడం లేదు అనేది పెద్ద వాదన. ఇద్దరూ పైకి కొట్టుకోక పోయినా లోలోన కోల్డ్ వార్ జరుగుతోంది అనేది తెలిసిన విషయమే. ఏపీ లో టీడీపీ నేతల మీద బీజేపే నేతలు నిత్యం విమర్శలు చేస్తూ ఉన్నా కేంద్రం తో పని ఉంది కాబట్టి టీడీపీ ఎదురు దాడి అనేది అస్సలు చెయ్యడం లేదు.
చంద్రబాబు ఒద్దు అని చెప్పడమే దీనికి కారణంగా చెబుతారు. కేంద్రం తో ఏపీ కి భారీ అవసరాలు ఉన్న పరిస్థితి లో బాబు గారు స్వయంగా సైలెంట్ అవ్వమని సంకేతాలు ఇచ్చేవారు. కానీ ఈ మధ్య కాలం లో నెమ్మది నెమ్మదిగా దూకుడు పెంచుతున్నారు టీడీపీ వారు కూడా. కేంద్రం తన హామీలు నిలబెట్టుకోవాలంటూ ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం దానికి తొలిమెట్టు అని చెప్పుకోవాలి. అదే సమయంలో భాజపాతో రాజకీయ ఆట మొదలు పెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబుకు సన్నిహితుడు – రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణగా ఛెప్పుకోవాలి… తాజాగా ఆయన బీజేపీ మనసులోని కోరిక తీరదంటూ కాస్త రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఏపీలో అదికారంలోకి రావాలని బీజేపీ కంటున్న కలలు తీరబోవని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో బీజేపీ కి అధికారం రాదు అనేసి ఆయన మొఖం మీదనే చెప్పేసారు. కేంద్రం విధి విధానాలు ప్రజల్లో ఆ పార్టీ కి ఆదరణ లేదు అన్నది ఆయన చెప్పిన మాట. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చే అంశం చట్టంలో పెట్టకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. అయితే.. ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం చెప్పడం లేదని మురళీ మోహన్ అంటున్నారు.
