తెలంగాణ 23 జిల్లాలతో వెలిగిపోబోతోంది. కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్ణయించారు. వరుసగా రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లతోనూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ జిల్లాల నాయకులతోనూ చర్చించిన తర్వాత 13 కొత్త జిల్లాలకు అంగీకారం తెలిపారు. ఈ జిల్లాలతో పాటు కొత్తగా తొమ్మిది రెవిన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ సారి తెలంగాణలో పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, యాదగిరిగుట్ట జిల్లా కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే తెలంగాణ కోసం కలలు కని మరణించిన ప్రొఫెసర్ జయశంకర్ పేరిట కూడా ఓ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. సిరిసిల్లా కేంద్రంగా రాజన్న జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్ కేంద్రంగా జిల్లా చేయాలన్న ఆలోచనపై ముమ్మర చర్చలు జరుగుతున్నాయి.
నాలుగైదు రోజుల్లో దీనిని కూడా ఖరారు చేసి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలు వెల్లడించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా పాలన సులభతరం అవుతుందని, ప్రజలు దూరాన ఉన్న జిల్లా కేంద్రాలకు వ్యయప్రయాసలకు ఓర్చి వెళ్లే ఇబ్బందులు తొలగిపోతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు భావిస్తున్నారు.
