ఇది నిజం.. గుడ్ మార్నింగ్ చెప్పలేదని ప్రధానమంత్రి ఏకంగా పార్లమెంట్ సభ్యులను ప్రశ్నించారు. రోజూ మీకు గుడ్ మార్నింగ్ అని సెల్‌ఫోన్లకు సందేశం పంపుతుంటే.. ఎవరూ రిప్లే ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన శుక్రవారం (డిసెంబర్ 29)న బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో చోటుచేసుకుంది.
సాక్షాత్తు ఎన్డీఏ సర్కారు ప్రజాప్రతినిధులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోప్పడ్డారు. సొంత పార్టీ బీజేపీకి చెందిన ఎంపీలపై సున్నితంగా మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా శుక్రవారం సమావేశాలు ప్రారంభం కావడానికి ముందుగా ఎప్పటిలానే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. ఈ సభకు మోదీ నేతృత్వం వహించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ఎంపీలంతా కూడా ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. ఎందుకంటే.. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నిబంధనను కొత్తగా అమల్లోకి తెచ్చారు మరి. తన ప్రసంగం చేస్తున్న సమయంలో మోదీ ఎంపీలందరికీ ఓ సరికొత్త ప్రశ్నడిగారు.
-ప్రతి రోజు తాను ఎంపీలందరికీ గుడ్ మార్నింగ్ అని సందేశాలు పంపుతున్నాను కదా. దానికి స్పందిస్తున్న వారెంత మంది? అని మోదీ పశ్నించారు. ఈ ప్రశ్నతో బీజేపీ ఎంపీలంతా బిక్కముఖం వేశారు. ఇదెక్కడి గుడ్ మార్నింగ్ గోలరా బాబూ? అంటూ వారంతా తల పట్టుకున్నారట. ఎంపీలుగా నిత్యం ప్రజలతో మమేకమయ్యే తాము సెల్ ఫోన్లకు వచ్చే ప్రతి మెసేజ్‌ను ఎలా చూసుకునేది అంటూ వారు ఒకింత సంకట స్థితిలో పడిపోయారట. ఎంపీల బ్లాంక్ ఫేస్‌లను చూసిన మోదీ… తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ… తానే స్వయంగా గుడ్ మార్నింగ్ అంటూ సందేశాలు పంపితే.. వాటికి కనీసం రిప్లై ఇవ్వకపోతే ఎలాగంటూ మోదీ ప్రశ్నించారట.
తన గుడ్ మార్నింగ్ మెసేజ్‌లకు కేవలం ఐదారుగురు ఎంపీలు మాత్రమే స్పందిస్తున్నారని, మిగిలిన వారు కనీసం తాను పంపిన మెసేజ్‌లను కూడా చూడడం లేదని తేలిపోయిందని మోదీ తెలిపారు. కేవలం తాను గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ మాత్రమే పెట్టడం లేదని, ప్రతి రోజు ఏదో ఒక ముఖ్యమైన అంశంపై మెసేజ్ పెడుతూనే ఉంటానని మోదీ చెప్పారు. ఇక ముందు ఇలా చేయొద్దని ప్రతి సందేశానికి స్పందించాలని చెప్పారట. ఇకపై మెసేజ్‌లకు స్పందించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారంట.
