మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీక్రెట్ కెమెరాలు, హిడెన్ సర్వైలెన్స్ వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ‘షీ నేత్ర’ పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ప్రతి జోన్‌కు ఒక బృందం చొప్పున మొత్తం 7 ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్ హోటళ్లు, హాస్టళ్లు, ట్రయల్ రూమ్స్, పబ్లిక్ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించి మహిళల గోప్యతను కాపాడే దిశగా పనిచేయనున్నాయి.
ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈ టీమ్స్‌కు అత్యాధునిక కెమెరా డిటెక్టర్లను అందజేశారు. ఈ పరికరాలతో సీక్రెట్ కెమెరాలను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.సజ్జనార్ మాట్లాడుతూ…తమ సంస్థల్లో ఎలాంటి హిడెన్ కెమెరాలు లేవని నిర్ధారించాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని హెచ్చరించారు.
నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు. అవసరమైతే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.‘షీ నేత్ర’ టీమ్స్ ఏర్పాటుతో మహిళలకు మరింత భద్రత కల్పించగలమని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
