తనపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ ప్రముఖ నేపథ్య గాయని మంగ్లీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో ఆయనను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు.
అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న సదరు వ్యక్తిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కమిషనర్‌ను కోరారు.
కేవలం తనపైనే కాకుండా, ఇలాంటి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ఆమె విన్నవించారు.సీపీని కలిసిన అనంతరం మంగ్లీ మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి, మహిళల పట్ల ఇలాంటి అసభ్యకరమైన ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం నేరమని, అందుకే తాను చట్టపరంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
