- Advertisement -

నయనం సీన్‌ రిపీట్…’కేటుగాళ్లు’ స్మార్ట్ గ్లాసెస్‌తో చిత్రీకరిస్తున్నారు!

- Advertisement -

సమాజంలో మహిళల భద్రత రోజురోజుకు దిగజారుతోంది. ప్రపంచం సాంకేతికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుండగా కొంతమంది కేటుగాళ్లు మాత్రం ఆ సాంకేతిక అభివృద్ధిని పక్కదారులు పట్టిస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రజల సౌకర్యం కోసం రూపొందించిన సాంకేతికత ఇప్పుడు వేధింపుల సాధనంగా మారుతోంది.

జీవితం సులభం చేయాల్సిన స్మార్ట్ గ్లాసెస్‌, అనుకోకుండా అనేక మంది మహిళలకు భయానక అనుభవంగా మారాయి. ఉదాహరణకు మీరు బీచ్‌లో సూర్యకాంతిని ఆస్వాదిస్తూ విశ్రాంతిగా ఉన్నారని ఊహించుకోండి. అప్పుడు ఓ వ్యక్తి మీతో మాట కలుపుతాడు. ప్రశంసలు చెబుతాడు, కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు వేస్తాడు, మీరు కోరుకున్నదానికంటే ఎక్కువసేపు అక్కడే ఉంటాడు. కాస్త అసౌకర్యంగా అనిపించినా పెద్ద ప్రమాదంలా అనిపించదు.

కానీ కొన్ని వారాల తర్వాత అదే సంఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్ లేదా టిక్‌టాక్‌లో కనిపిస్తుంది. అది మీ అనుమతి లేకుండా, అతని స్మార్ట్ గ్లాసెస్ ద్వారా చిత్రీకరించబడింది. ఇప్పుడు అది లక్షల వ్యూస్ సంపాదిస్తూ, అసభ్య వ్యాఖ్యలతో వైరల్ అవుతోంది. ఇది ఏదో భయానక సినిమా సీన్ కాదు. అమెరికా, బ్రిటన్‌లో అనేక మంది మహిళలు ఇప్పుడు ఈ కఠిన వాస్తవాన్ని ఎదుర్కొంటున్నారు.

ఇటీవల ఓటీటీలో వచ్చిన వరుణ్ సందేశ్ చిత్రం నయనం కూడా ఇలాంటిదే. హ్యాండ్స్-ఫ్రీ సెల్ఫీలు, తక్షణ అనువాదాలు, వాయిస్ అసిస్టెంట్ల కోసం రూపొందించిన స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు మహిళలకు అత్యంత పెద్ద భయంగా మారాయి. సౌకర్యంగా ఉండాల్సిన ఈ వేర్‌బుల్ టెక్నాలజీ, ముఖ్యంగా మహిళలపై రహస్య నిఘా సాధనంగా మారుతోంది.

కొంతమందికి ఆకర్షణగా కనిపించే ఈ గ్లాసెస్, తెలియని మహిళలకు నిజంగా భయానకంగా మారుతున్నాయి. ముఖ్యంగా ‘పిక్-అప్ ఆర్టిస్ట్స్’ అని పిలువబడే కొంతమంది పురుషులు — మహిళలను మానసిక మోసంతో ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకునే వారు — ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు.బీచ్‌లలో, బస్ స్టాప్‌ల వద్ద, రోడ్లపై నడుస్తూ ఉండగా — స్మార్ట్ గ్లాసెస్ ధరించిన పురుషులు తమను అనుమతి లేకుండా వీడియోలు తీస్తున్నారని మహిళలు చెబుతున్నారు. ఆ ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో వేధింపుల వ్యాఖ్యలు, హ్యాష్‌ట్యాగ్‌లతో షేర్ చేస్తున్నారు.

ఇలాంటి ఘటనకు గురైన ఓ మహిళ మాట్లాడుతూ… నా అవగాహన లేకుండా, నా అనుమతి లేకుండా నన్ను చిత్రీకరించడం తీవ్రమైన ఆందోళన కలిగించింది. ఆ తర్వాత దాన్ని ఇలా సోషల్ మీడియాలో పెట్టడం వెనుక మంచి ఉద్దేశాలు లేవని నాకు అనిపించింది అని చెప్పారు. ఆ వ్యక్తి మత్తులో ఉన్న మహిళలను, బలహీనంగా ఉన్న మహిళలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని, వారి ప్రతిస్పందనను కంటెంట్‌గా ఉపయోగిస్తున్నాడని నాకు అనిపిస్తుంది అని ఆమె అన్నారు.
ఇలాంటి కంటెంట్‌కు ప్రత్యేకంగా సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఉన్నాయి — కానీ ఎవ్వరూ పెద్దగా స్పందించడం లేదు.

ఇటీవలె అమెరికాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ట్విచ్ స్ట్రీమర్ హెర్క్యులైజ్, తనను రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ ద్వారా అనుమతి లేకుండా చిత్రీకరించిన విషయం తెలిసి ఆన్‌లైన్‌లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సూపర్ మార్కెట్‌లో ఓ వ్యక్తి ఆమెతో సాధారణంగా మాట్లాడి, ప్రశంసలు చెప్పి వెళ్లిపోయాడు.
తర్వాత ఆ సంభాషణ వీడియోగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిందని ఆమెకు తెలిసింది. ఎక్స్ (X)లో ఆమె దీనిని అత్యంత అవమానకరమైన అనుభవం గా పేర్కొంటూ, ఆ సమయంలో తాను చిత్రీకరించబడుతున్నానన్న విషయమే తెలియదని చెప్పారు.

మనలో చాలామంది ప్రజా ప్రదేశాల్లో రికార్డింగ్ చేయడం చట్టబద్ధమే అన్న భావనకు అలవాటుపడ్డాం. ఫోన్ కెమెరా అయితే కనిపిస్తుంది — మీరు చూసి, మీ ప్రవర్తన మార్చుకోవచ్చు. కానీ స్మార్ట్ గ్లాసెస్ ఆ సరిహద్దును మసకబారుస్తాయి.మెటా వంటి సంస్థలు (రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ తయారీదారు) దీనిపై స్పందించేందుకు ప్రయత్నించాయి. రికార్డింగ్ జరుగుతున్నప్పుడు గ్లాసెస్‌పై చిన్న తెల్లటి లైట్ వెలిగేలా చేశారు. సిద్ధాంతంగా అది హెచ్చరిక. కానీ వాస్తవంలో, పగటి వెలుతురులో లేదా ప్రకాశవంతమైన ప్రదేశాల్లో ఆ లైట్ కనిపించదు. అంతేకాదు, వాయిస్ కమాండ్‌తో తీసే ఫోటోలకు ఆ లైట్ ఉండదు.

భారతదేశంలో ఇది భవిష్యత్తు సమస్య కాదు — ఇది ఇప్పటికే మొదలైంది. కానీ మన గోప్యత చట్టాలు ఇంకా వెనుకబడ్డాయి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం, ప్రజా ప్రదేశాల్లో వేర్‌బుల్ పరికరాలతో రికార్డింగ్ జరుగుతుంటే, పక్కన ఉన్నవారికి తెలియజేయాల్సిన నిబంధన లేదు. తమ అనుమతి లేకుండా తీసిన ఫుటేజ్‌ను చూడడానికి లేదా తొలగించడానికి కూడా స్పష్టమైన హక్కులు లేవు.అంటే… కేఫ్‌, మెట్రో స్టేషన్‌, పార్క్‌, ఆలయం వంటి ప్రదేశాల్లో ఎవరైనా మిమ్మల్ని చిత్రీకరించి, మీరు అది ఉందో లేదో కూడా తెలియకుండా ఉండే పరిస్థితి.

జగన్నాథ ఆలయం, అయోధ్య రామ మందిరం వంటి పవిత్ర స్థలాల్లో ఫోటోగ్రఫీ నిషేధం ఉన్నప్పటికీ, స్మార్ట్ గ్లాసెస్‌తో చిత్రీకరణ ఘటనలు ఇప్పటికే చోటుచేసుకున్నాయి. శాసనసభల్లో స్మార్ట్ పరికరాలపై ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది. కాబట్టి మహిళలు మీరు జాగ్రత్త లేదంటే తర్వాతి బాధితులు మీరే కావొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -