ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన వైసీపీ నేతలపై దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన నగరంలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ సమీపంలో చోటుచేసుకుంది.
వైసీపీ నాయకులు టీటీడీ చైర్మన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద చేరుకుని ఆందోళన చేపట్టారు.
అయితే అక్కడికి వచ్చిన తెలుగు దేశం పార్టీకు చెందిన కొందరు కార్యకర్తలు నిరసనకారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ వాగ్వాదం క్రమంగా ఉద్రిక్తతలకు దారి తీసి, కొంతమంది టీడీపీ నేత జె.బి అనుచరులు వైసీపీ నేతలపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ దాడిలో తిరుపతి నార్త్ క్లస్టర్ వింగ్ అధ్యక్షుడు నవీన్ గాయపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిరసనలో పాల్గొన్న ఒక వైసీపీ మహిళా కార్యకర్త కూడా దాడిలో గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో తిరుపతిలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
