ఒకవైపు తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనడానికి ప్రయత్నించి తెలుగుదేశం పార్టీ అభాసుపాలయ్యింది. కోట్ల రూపాయల ఎరవేసి ఎమ్మెల్యేను కొనడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్ అయ్యింది.
ఏసీబీ కేసులను ఎదుర్కొంటోంది. ఇలాంటి నేపథ్యంలో కూడా పచ్చ చొక్కాలు తగ్గలేదు. కర్నూలు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వారు తమకు మెజారిటీ లేకపోయినా పోటీ చేశారు.. ఇప్పుడు గెలిచారు కూడా!
కర్నూలు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. వాస్తవానికి ఈ కోటాలో వైకాపాకు ఫుల్ మెజారిటీ ఉండింది. ఆ రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీ గెలవడం అనైతికమే! కానీ టీడీపీ గెలిచింది. తమ పార్టీకి సొంతంగా బలం లేకపోయినా.. వైకాపా తరపున గెలిచిన ఎమ్ పీటీసీలను, జడ్పీటీసీలను తనవైపుకు తిప్పుకొని తెలుగుదేశం గెలిచింది.
మరి ఇదేంటి అంటే.. తమ పార్టీ అధినేత చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఎంపీటీసీలు తమ వైపుకు వచ్చారని.. ఇంత చంద్రబాబు క్రెడిట్ అని తమ్ముళ్లు చెబుతున్నారు! అయితే..ఇలా చెప్పుకోవడం పెద్ద కథేమీ కాదు. అయితే బలం లేని చోట గెలవడం అంటే అది డబ్బుతో చేసే పని అని వేరే చెప్పనక్కర్లేదు కూడా. తెలుగుదేశం కూడా ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను కొనే గెలిచి ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి వీటిని తమ్ముళ్లు ఎలా సమర్థించుకొంటారో!
