Monday, May 13, 2024
- Advertisement -

వచ్చే నెల 8నే ఎన్నికల నోటిఫికేషన్ ?

- Advertisement -

కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. అసెంబ్లీ రద్దు అయిన సందర్భాల్లో ఆ రాష్ట్రానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎన్నికలు ముందుగా నిర్వహించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపి రావత్ కూడా అదే చెప్పారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఐతే తెలంగాణలో అసెంబ్లీ రద్దు నేపథ్యంలో, అప్పటికే ఉన్న సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా తాము ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా వచ్చే ఏడాది జనవరి వరకూ ఉన్న ఓటర్ల జాబితా సవరణ తేదీని వచ్చే నెల 8వ తేదీకి కుదించారు. ఆ తేదీలోగా కొత్త ఓటర్ల చేర్పులు మార్పులు చేసుకోవాలని సూచించారు. అయితే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే అదే రోజు సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. నోటిఫికేషన్ నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే విడుదలచేసినా తెలంగాణ ఎన్నికలు మాత్రం నవంబర్ ఆఖరి వారంలో పూర్తి చేయాలని యోచిస్తోంది. దీనిపై రేపు మంగళవారం 5 రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో కేంద్ర ఎన్నికల సంఘం చర్చించనుంది.

అసెంబ్లీ రద్దు అయిన వెంటనే తెలంగాణలో ఎన్నికల నిర్వహణ సాధాసాధ్యాలపై ఈసీ దృష్టి పెట్టింది. ఇప్పటికే 8 జిల్లాలకు ఈవీఎంలు, వివిపాట్ లు పంపించేశారు. ఈ నెల 24 నుంచి బ్యాచ్ ల వారీగా వివిపాట్ ల వాడకంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఓటర్ల జాబితా సవరణలో అభ్యంతరాలు ఉంటే తెలియజేసి, సవరణ చేసుకునేందుకు ఈ నెల 25 వరకూ గడువు ఇచ్చారు. మరోవైపు తెలంగాణలోని అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించేయడంతో వారు ప్రచారంలో జోరు పెంచారు. కాంగ్రెస్ టీడీపీ వామపక్షాలు టీజేఎస్ మహాకుటమిగా ఏర్పడుతున్నారు. వీరిలో సీట్ల పంపకాలు పూర్తయితే అభ్యర్ధులు ఖరారు అయితే ఇక పూర్తి స్థాయి వేడి రాజుకోనుంది. టీఆర్ఎస్ అభ్యర్ధుల మార్పు ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీ ఫామ్ వచ్చినంతవరకూ అభ్యర్ధుల ఫైనల్ కానట్టేననే అంటున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా టీడీపీతో కలసి సరైన అభ్యర్ధుల ఎంపిక, ఓట్ల మార్పిడిపై దృష్టి పెట్టింది. అమిత్ షా ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించారు. తమ ప్రధాన ప్రత్యర్ధి టీఆర్ఎస్ అని ఆయన చెప్పుకొస్తున్నా, జనం ఆయన మాటలను విశ్వసించే స్థితిలో లేరు. టీఆర్ఎస్ బీజేపీ సీక్రెట్ ఫ్రెండ్స్ అని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం తెలంగాణలో అగ్గి రాజుకోవడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -