వైసీపీ నేత తోట త్రిమూర్తులు తాజాగా జరిగిన చిట్ చాట్‌లో బీహార్ రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు, కూటముల సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా చర్చ సాగుతోందని ఆయన అన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లి ఉప ప్రధాని పదవిని చేపడతారనే చర్చలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయని తోట త్రిమూర్తులు తెలిపారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే రాష్ట్రంలో నాయకత్వ మార్పులపై కూడా చర్చ తప్పదన్నారు. చంద్రబాబు కేంద్రానికి వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇవ్వడం సరైన నిర్ణయం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవచ్చని సూచించారు. లోకేష్‌ను నేరుగా ముఖ్యమంత్రిగా చేస్తే కాపు సామాజిక వర్గం అంగీకరించే అవకాశం తక్కువగా ఉంటుందని తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు.
రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాలను సమతూకంగా తీసుకెళ్లేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
