తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తమ పార్టీ రాజకీయ విధానాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యానాలు రాజకీయ వర్గాల్లోనూ.. జనాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆమె మాట్లాడిన మాటలు ఆమెకు పదవిపై ఉన్న ఆకాంక్షను చాటేలా ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ కవిత ఏమన్నదంటే…
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి ఆహ్వానం వస్తే తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరుతుంది అని కవిత వ్యాఖ్యానించింది.
మోడీ నుంచి పిలు వస్తే.. తాము ఆ అంశం గురించి ఆలోచిస్తామని ఆమె చెప్పుకొచ్చింది. మరి ఇప్పటికే చాలా రోజులుగా టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరడం గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ఎన్డీయేలో భాగస్వామి కావడానికి తెరాస చాలా రోజులుగా ఎదురుచూస్తోందని అంటున్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఆ కూటమిలోకి చేరడానికి టీఆర్ఎస్ ఉత్సాహంతో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కవిత కూడా ఆ అంశం పట్ల వ్యతిరేకతను కనబరచలేదు.
ఆహ్వానం వస్తే ఆలోచిస్తాం అని అంటోంది. మరి ఎన్నికల వరకూ అయితే బీజేపీ, టీఆర్ఎస్ లు వేరు వేరుగా పోటీ చేశాయి. ఒక పార్టీపై మరోటి దుమ్మెత్తిపోసుకొన్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత కూడా రెండు పార్టీల మధ్య విరోధం కొనసాగుతోంది. అయితే టీఆర్ఎస్ గతాన్ని మరిచిపోవడానికే ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.
ఎలాగైనా కేంద్రంలో అధికారంలో భాగస్వామి కావడానికే ప్రాధాన్యతని ఇస్తోంది. ఆలోచిస్తామని కవిత అంటున్నప్పటికీ.. ఇది ఆకాంక్షను బయటపెట్టుకొంటున్నట్టుగానే ఉంది. మరి మోడీ నుంచి పిలుపు వస్తే అనే విషయాన్ని కూడా కవిత ప్రస్తావించింది కాబట్టి.. మోడీ టీఆర్ఎస్ ను ఎప్పుడు పిలుస్తారో.. అసలుపిలుస్తారో లేదా అనేవి ఆసక్తికరమైన అంశాలు.
