భారత స్టార్ రెజ్లర్, హర్యానా ఎమ్మెల్యే వినేశ్ ఫోగట్ మరోసారి వార్తల్లో నిలిచారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తాము చేసిన లైంగిక వేధింపుల పోరాటంలో ఒక కీలక నిజాన్ని ఆమె బయటపెట్టారు. బ్రిజ్ భూషణ్‌పై ఫిర్యాదు చేసిన ఆరుగురు బాధితుల్లో తాను కూడా ఒకరినని వినేశ్ బహిరంగంగా ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌కు ముందు వినేశ్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 20 నెలల విరామం తర్వాత ఆమె ఈ టోర్నమెంట్ ద్వారా తిరిగి రింగ్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. అయితే, ఈ పోటీలు బ్రిజ్ భూషణ్ నివాసం మరియు ఆయన ప్రభావం ఉన్న ప్రాంతంలో జరుగుతుండటంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితుల పేర్లు బయటపెట్టకూడదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. బ్రిజ్ భూషణ్‌పై ఫిర్యాదు చేసిన ఆరుగురు బాధితుల్లో నేను ఒకరిని. మా వాంగ్మూలాల నమోదు ఇంకా కొనసాగుతోంది అని ఆమె తెలిపారు.
గోండాలో జరిగే టోర్నమెంట్‌లో రిఫరీలు, అధికారులు అందరూ బ్రిజ్ భూషణ్ మనుషులే ఉంటారని, అక్కడ తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని ఆమె పేర్కొన్నారు. గోండాలో జరిగే పోటీల సమయంలో నాకు, నా టీమ్ సభ్యులకు లేదా నా మద్దతుదారులకు ఏదైనా అపశ్రుతి జరిగితే దానికి భారత ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని వినేశ్ హెచ్చరించారు. ప్రభుత్వం మరియు క్రీడా మంత్రిత్వ శాఖ కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయని, బ్రిజ్ భూషణ్‌కు స్వేచ్ఛనిచ్చాయని ఆమె ఆరోపించారు.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన తర్వాత వినేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, మళ్ళీ రెజ్లింగ్ మ్యాట్‌పైకి వచ్చి దేశం కోసం మెడల్స్ సాధించాలన్న పట్టుదలతో ఆమె ఉన్నారు. 2026లో జరగబోయే ఆసియా క్రీడల్లో పాల్గొనడమే తన లక్ష్యమని, కానీ ఈలోపే తన కెరీర్‌ను దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
