Sunday, May 5, 2024
- Advertisement -

అడ్డంగా దొరికిపోయిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

- Advertisement -

రెండో దఫా అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల ఉనికి లేకుండా చేద్దామనుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇంటా బయటా అనూహ్య పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్‌ను ఖాళీ చేసి తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన కారు పార్టీకి బీజేపీ సరైన ప్రత్యామ్నాయంగా అవతరించింది. దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదు చేసి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అదే జోరును కొనసాగించింది. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో 4 సీట్లకే పరిమితమైన కాషాయ పార్టీ తాజాగా 48 డివిజన్లలో జయకేతనం ఎగురవేయంతో టీఆర్‌ఎస్‌ ఆత్మరక్షణలో పడింది.

అదే సమయంలో సొంత పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ అడ్డంగా దొరికిపోవడంతో ‘కారు’ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యేలా ఉంది. తాజాగా వార్త దినపత్రిక విలేకరి సంతోష్‌ నాయక్‌ను అసభ్య పదజాలంతో దూషించిన పటాన్‌చెరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూ కబ్జాలపై వార్తలు రాసినందుకు నీ ఇంటికొస్త.. నీ కాళ్లు.. చేతులు నరుకుత అంటూ ఎమ్మెల్యే బాధితుడిని బెదిరించిన వైనం సంచలనం రేపింది. బాధితుడితో కలసి నిన్న అమీన్ పూర్ పోలీస్టేషన్లో టీయూడబ్ల్యూజే, ఐజేయు విలేకరుల సంఘం ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

మంత్రి మల్లారెడ్డి, రసమయిపైనా..
తన భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంకు చెందిన శ్యామలదేవి అనే మహిళ మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మల్లారెడ్డి చెరలో ఉన్న భూమిని విడిపించాలంటూ ఓ న్యాయవాదిని సంప్రదిస్తే.. మంత్రి మల్లారెడ్డి ఆయనతో కుమ్మకై తప్పుడు పత్రాలు సృష్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ భూ కబ్జా కేసు నమోదైంది.

ఇక టీఆర్‌‌ఎస్‌ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కరీంనగర్‌ యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్త పోతిరెడ్డి రాజశేఖర్‌‌ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా కోర్డినేటర్‌‌గా పనిచేస్తున్న తనను రసమయి అసభ్యంగా దూషించారని ఆరోపించారు. డీజీపీ మహేందర్ రెడ్డిని గత సోమవారం కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తమ నియోజకవర్గ సమస్యలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు నవంబర్‌ 7న రసమయి తనకు ఫోన్‌ చేసి అట్రాసిటీ కేసులు పెడతానని, అంతు చూస్తానని బెదిరించినట్లు రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

వీరితోపాటు కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కే.పి. వివేకానందపై బెదిరింపుల ఆరోపణలొచ్చాయి. ఎమ్మెల్యే వివేకానంద తనను బెదిరించాడని గాజుల రామారం వీఆర్‌ఓ శ్యామ్‌ కుమార్‌ ఆరోపించారు. కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌ ఆదేశాలమేరకు విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చినందుకు ఎమ్మెల్యే ఫోన్‌ చేసి అసభ్య పదజాలంతో తనను దూషించాడని అన్నారు. తనపై, రెవెన్యూ శాఖ అధికారులపై ఎమ్మెల్యే తిట్ల పురాణానికి సంబంధించి ఆడియో టేపులను పోలీసులకు అందించానని శ్యామ్‌ తెలిపారు. ఎమ్మెల్యేపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్లో ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు.

బాబు తీరుతో తెలుగు తమ్ముళ్లు బేజారు!

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుందా?

కారు పార్టీతో కాంగ్రెస్‌ కలిసి నడుస్తుందా?

బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. అలాంటి నేతలే ప్రధాన టార్గెట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -