Monday, May 13, 2024
- Advertisement -

తెలంగాణ ఎన్నికలపై నేడు లేదా మంగళవారం ఈసీ నిర్ణయం

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై కేంద్ర ఎన్నికల సంఘం నేడు తన నిర్ణయాన్ని తీసుకునే అవకాశముంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయాన్ని బహుశా ఈ రోజే ప్రకటించకపోవచ్చు. వచ్చే మంగళవారం వెళ్లడించే అవకాశాలున్నాయి. సాధారణంగా వివిధ రాష్ట్రాల ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించడానికి ఎన్నికల సంఘం ప్రతి మంగళ, శుక్రవారం సమావేశమవుతూ ఉంటుంది. ఆ ఆనవాయతీ ప్రకారం నేడు శుక్రవారం కూడా మీటింగ్ జరగనుంది. గురువారం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు అందజేయడం, ఆయన క్షణాల్లో రాజభవన్ నుంచే ఈసీకి అసెంబ్లీ రద్దు అంశాన్ని ఫ్యాక్స్ చేయడం జరిగిపోయాయి. మరోవైపు తెలంంగాణ అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు కూడా వెంటనే ఓ రిపోర్ట్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ కు పంంపించారు. ఆయన ఆ రిపోర్ట్ ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు.

ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్, డిసెంబర్ లో ఎలక్షన్స్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ రద్దు కూడా కావడంతో ముందస్తు ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఈ సందర్భంలో తెలంగాణలో రానున్న పండుగలు, విద్యార్ధుల పరీక్షలు, ప్రభుత్వ సిబ్బంది సెలవులు, ఓటర్ల జాబితా సవరణ, మార్పులు చేర్పులు, వాతావరణ పరిస్థితులు, తుఫాను హెచ్చరికలు వంటివాటిని దృష్టిలో పెట్టుకుని నిబంధనల ప్రకారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారు. అసెంబ్లీ రద్దు అయిపోయినా ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుంది. మళ్లీ ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం కొలువయ్యేవరకూ ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ స్పీకర్ అవే పదవుల్లో కొనసాగుతారు. ఎమ్మెల్యేలు మాత్రం మాజీలు అయిపోయారు.

అయితే ఇంకా 9 నెలల సమయం ఉన్నా, సరైన కారణాలు లేకుండా కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేశారని తెలంగాణ బీజేపీ కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో అనేక సార్లు అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసీఆర్ ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మళ్లీ అలాంటి దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందని బీజేపీ ఆరోపించింది. ఎన్నికలు జరగడానికి ఇంకా 9 నెలల సమయం ఉన్నందున అంతకాలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిజాయతీగా, పారదర్శకంగా వ్యవహరిస్తారనే నమ్మకం తమకు లేదని, కేసీఆర్ అడుగులకు మడుగులొత్తకుండా అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని దత్తాత్రేయ సహా బీజేపీ నేతలు గవర్నర్ కు కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -