జనసేన అధినేత పవన్ టీడీపీ ఎమ్మెల్యే, సీనీనటుడు బాలకృష్ణపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమైన ఆయన, ఇటీవల తన అభిమానులు నిర్వహించిన ఓ ర్యాలీలో బైక్ సైలెన్సర్లు తీసేసి భారీ రొద చేసిన విషయంలో పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
జనసేన సైనికులు బైక్ సైలెన్సర్ తీసి శబ్దం చేస్తే అదేదో పెద్ద నేరం చేసినట్లు చూస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇంట్లో తుపాకీతో కాల్చి బయట తిరుగుతున్న వాళ్లను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు ఉప్పించారు. జన సైనికుల సంస్కారం చాలా గొప్పదని వ్యాఖ్యానించిన ఆయన, అధికారులు లంచాల మత్తులో మునిగి ఉన్నారని, అక్రమంగా ఆక్వాకు వంత పాడుతున్నారని, అందువల్లే తాగు నీరు కలుషితమవుతుందని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఈ విమర్శలు చేసినప్పటికీ, ఇవి హిందూపురం ఎంపీ బాలకృష్ణ గురించి చేసినవేనని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పెడుతున్నారు. 2004లో బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలగా, నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిషుడు సత్యనారాయణ చౌదరి గాయపడిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో బాలకృష్ణపై ఆరోపణలు వచ్చినప్పటికీ, ఎవరు కాల్చారో తనకు తెలియదని బెల్లంకొండ చెప్పడంతో సరైన సాక్ష్యాలు లేని కారణంగా న్యాయస్థానం ఈ కేసును కొట్టేసింది. ఇక రెండు రోజుల క్రితం టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని మండిపడ్డారు.
