Monday, May 13, 2024
- Advertisement -

కేసులతో మారనున్న అభ్యర్ధుల జాతకాలు

- Advertisement -

పాతకేసులే మళ్లీ పంజా విసురుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉచ్చు బిగుస్తున్నాయి. అధికార పార్టీ కావాలనే పాత కేసులను తిరగతోడి ప్రత్యర్ధులను ఇరికిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చేసిన పాపాలు ఊరికే పోతాయా ? ఏళ్లు గడిచినా నిజాలు బయట పడాల్సిందే. దోషులు శిక్ష అనుభవించాల్సిందేనని అధికార పార్టీ స్పష్టం చేస్తోంది. ఇక నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ కేసులు ఏ మలుపు తిరగనున్నాయి ? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతోంది ? తెలుసుకునేముందు ఓ సారి కేసుల గురించి చూద్దాం.

కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై 2003 నాటి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని అవకతవకల కేసులో తాజాగా నోటీసులు అందాయి. 15 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. మరికొంత సమయం ఆయన అడిగారు. అతడిని అరెస్ట్ చేసే అవకాశముంది. మనుషుల అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి జైలుపాలయ్యారు. 2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యే హోదాలో తన కుటుంబీకుల పేరుతో గుజరాత్ కు చెందిన ఓ కుటుంబాన్ని అమెరికా పంపారని, అప్పటి నుంచి ఆ కుటుంబం ఆచూకీ లేదని కేసు నడుస్తోంది. నకిలీ డాక్యుమెంట్లు, మనుసుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డిపై చురుగ్గా దర్యాప్తు సాగుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై వరంగల్ జిల్లా శాయంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయుధచట్టం కింద గండ్ర వెంకటరమణతో పాటు ఆయన సోదరుడు భూపాల్ రెడ్డిపై కేసు విచారణలో ఉంది.

వీళ్ల ముగ్గురు నేతలే కాదు త్వరలో మరిన్ని కేసుల్లో ఇంకొందరు నేతలకు నోటీసులు, అరెస్టులు ఉండవచ్చు. ఈ వ్యవహారం ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఉండే అవకాశముంది. ప్రతిపక్షాల అభ్యర్ధులకు బీ ఫాం ఇచ్చాక, అరెస్ట్ జరిగి జైలు పాలయితే, ఒక్కసారిగా రాజకీయం కీలక మలుపు తిరగనుంది. ఎలాంటి షాకింగ్ ఘటనలు జరిగినా ఎదుర్కొనేలా ఇప్పటికే విపక్షాల నేతలు, అభ్యర్ధులు మానసికంగా సిద్ధపడుతున్నారు. తమ అరెస్టులు, జైలు జీవితం తప్పనిసరైతే…తమ స్థానంలో భార్యలను, వారసులను, ఇతర కుటుంబీకులను బరిలో దించాలనే ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక్కో నేత కనీసం తమ కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురుని ఎలక్షన్ కోసం సిద్ధం చేస్తున్నారు. తాము బెయిల్ పై వచ్చినా రాకపోయినా, కేసులు ఎటువంటి మలుపులు తిరిగినా, ఎలాంటి ఊహకందని ఘటనలు ఎదురైనా ఎన్నికలకు తమ కుటుంబాలు దూరం కాకుండా ప్రత్యమ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. సో కేసులు ఎదుర్కొంటున్న నాయకులు జైలు పాలైతే, వారి స్థానంలో వారి కుటుంబీకులు పోటీ చేసే అవకాశాలున్నాయి. అదుకే వారి జాతకాలు ఎలా ఉండబోతున్నాయో ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -