Sunday, May 5, 2024
- Advertisement -

వైఎస్ఆర్ సీపీ పోటీ గెలవడానికి కాదు ఓడించడానికి

- Advertisement -

కర్నూలులో రాహుల్ గాంధీ సభ గ్రాండ్ సక్సెస్ తర్వాత ఏపీలో హస్తం పార్టీ పుంజుకుంటుందనే సంకేతాలు వెలువడ్డాయి. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఫీనిక్స్ పక్షిలాంటిదని, ఎన్నో ఢక్కామొక్కీలు తిన్న ఆ పార్టీ ఏపీలో పుంజుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషణలు వచ్చాయి. దూరమైపోయిన పార్టీ సీనియర్లు, ఇతర పార్టీల్లో చేరకుండా ఉన్న నాయకులు మెల్లగా మళ్లీ కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. కర్నూలు సభకు జనం కూడా భారీగా తరలివచ్చారు. దీంతో ఆ పార్టీ మళ్లీ ఏపీలో బలపడుతోందని, మరింత బలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బని చర్చలు జోరుగా సాగాయి. వైఎస్ఆర్ సీపీలో ఉన్న కార్యకర్తల్లో అత్యధిక శాతం మంది కాంగ్రెస్ కు చెందినవాళ్లే. వాళ్లంతా ప్రత్యేకహోదాను బలంగా కోరుతున్నవాళ్లే. యూపీఏ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేకహోదా ఫైల్ పైనే అని ఇప్పటికే సోనియా, రాహుల్ సహా ఏఐసీసీ పదే పదే ప్రకటిించింది. ఈ నేపథ్యంలో హోదా కోసం పరితపిస్తున్న శ్రేణులంతా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండం వల్ల తమ ఆకాంక్ష నెరవేరుతుందని, హోదా వస్తే తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్ తరాలు ఏపీలోనే స్థిరపడ వచ్చని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కనుకే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వగలిగిందని గుర్తు చేసుకుంటున్నారు. రేపు మళ్లీ యూపీఏ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని గతంలో కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించి తదనంతర పరిస్థితుల్లో వైఎస్ఆర్ సీపీ సహా ఇతర పార్టీల్లో చేరిన నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. మరోవైపు హోదాపై మోసం చేసిన బీజేపీని జగన్ పల్లెత్తు మాట అనడం లేదు. పైగా వారి సపోర్టుతో నెట్టుకొస్తున్నాడు. రేపు ఎన్నికల తర్వాత కూడా వారికి మద్దతు ఇస్తాడు. అనే కోపంతో రగిలిపోతున్నాురు. ఇక్కడ వీరి కోపం జగన్ మీద కంటే బీజేపీ మీదే ఎక్కువ. మోసం చేసిన బీజేపీతో ఎవరు చేతులు కలిపినా ఏపీ ప్రజలు తట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందని, ఆ పార్టీ విజయావకాశాల మీద అది ప్రభావం చూపుతుందనేది స్పష్టమవుతోంది.

అయితే ఏపీలో తనను దెబ్బకొట్టాలనుకుంటున్న కాంగ్రెస్ ను తెలంగాణలో దెబ్బ కొట్టాలని వైఎస్ జగన్ వ్యూహం రచించారు. తనపై కేసులు పెట్టించి, జైలు పాల్జేసిన కాంగ్రెస్ మీద కక్ష తీర్చుకునేందుకు జగన్ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులను బరిలో దించాలని భావిస్తున్నారు. అయితే అక్కడ తమ పార్టీ అభ్యర్ధులను బరిలో దించుతున్నది వారి గెలుపు కోసం కాదు. కేవలం కాంగ్రెస్ నేతలను ఓడించడానికే పోటీ చేయించనున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో 92 స్థానాల్లో పోటీ చేసిన వైఎస్ఆర్ సీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పలు చోట్ల స్వల్ప తేడాతో ఆ పార్టీ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు. గెలిచిన తర్వాత ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా జగన్ ఆదేశాలతోనే టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.

ఇక ఇప్పుడు కూడా పోటీ చేయకూడదనే వైఎస్ఆర్ సీపీ ముందు భావించింది. కానీ పోటీ చేయకపోతే తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ నేతలకు పడిపోతాయి. దీంతో ఆ పార్టీ గెలిచే చాన్స్ ఉంది. అందుకే తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి అభిమానులు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆయన బొమ్మ పట్టుకుని వైఎస్ఆర్ సీపీ నేతలు ఓట్లు అడుగుతారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలకు పడాల్సిన ఓట్లు వైఎస్ఆర్ సీపీ నేతలకు పడతాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. దీనివల్ల వైఎస్ఆర్ సీపీ నేతలు గెలిచే పరిస్థితి ఉండదు. కానీ కాంగ్రెస్ నేతల ఓట్లుతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లులో చీలిక వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఓడిపోయే అవకాశముంది. అందుకే తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఖమ్మం జిల్లాలోని 3 స్థానాలతో పాటు, నర్సంపేట, వరంగల్ జిల్లాలోని 2, నల్గొండ జిల్లాలో 2, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 2, గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోని 4 స్థానాల్లో జగన్ తమ పార్టీ అభ్యర్ధులను నిలబెట్టాలని భావిస్తున్నారు. మొత్తం 14 నుంచి 16 స్థానాల్లో ఈ పోటీ ఉండవచ్చు. వీరందరి లక్ష్యం ఒక్కటే, కాంగ్రెస్ ఓట్లు చీల్చడం, కేసీఆర్ పార్టీకి మేలు చేయడం. తెలంగాణ వరకూ జగన్ వ్యూహం, రాజకీయ అవసరాలు, కక్ష సాధింపు రాజకీయాలు ఎంతవరకూ సబబో కానీ, ఈ వ్యూహం రేపు ఏపీలో ఆయనపై ప్రభావం చూపకపోతే ఆయనకే మేలు. ఎందుకంటే హోదా ఇస్తామన్న కాంగ్రెస్ ను ఓడించి, విభజనకు కారణమైన టీఆర్ఎస్ గెలుపు కోసం పోటీలో దించారన్న జగన్ వ్యూహాన్ని టీడీపీ నేతలు ఎండగడితే, ఏపీలో జగన్ పార్టీకే నష్టం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -