Saturday, May 4, 2024
- Advertisement -

సాక్షి డిజాస్టర్…. కొమ్మినేని అట్టర్‌ఫ్లాప్.. ఎల్లో మీడియాని బీట్ చేయలేకపోతే 2019లో కూడా ఔట్

- Advertisement -

పడవ ప్రమాదం, పోలవరం విషయం చేతులెత్తేయడం, నంది అవార్డ్స్ గొడవలతో చంద్రబాబు పూర్తిగా ఇరకాటంలో పడిన పరిస్థితి. అజ్ఙాతవాసిగా ఉన్నప్పుడు గొప్ప నిజాయితీపరుడుగా, జ్ఙానిగా ప్రచారం చేయించుకున్న పవన్…..జనంలోకి వచ్చేసరికి అబద్ధాల కోరుగా, అజ్ఙానిగా నిరూపించబడిన పరిస్థితి. అయితేనేం ఎల్లో మీడియా భజన ప్రచారం ముందు సాక్షి కనీస స్థాయిలో కూడా నిలబడలేకపోయింది. జగన్ పాదయాత్ర మొదలుపెట్టిన రోజే పవన్ కళ్యాణ్ చేత కూడా చంద్రబాబు ఏదో ఒక హడావిడి చేయిస్తాడని రాజకీయ మేధావులు అందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలను తానే ప్రస్తావిస్తే తన పరువు తానే తీసుకున్నట్టు అవుతుంది కాబట్టి…..ఆ అవకాశం జగన్‌కి పోకుండా తన కోసం తానే ఒక ప్రతిపక్ష నాయకుడిని తయారు చేసుకున్నాడు చంద్రబాబు. అందుకే పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నట్టుగానే కనిపిస్తాడు. కానీ ఆ కార్యక్రమం అంతా కూడా చంద్రబాబుకు నొప్పి తగలకుండా ఉంటుంది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే చంద్రబాబు పాలన గొప్పగా లేదని భావిస్తున్న జనాలందరికీ కూడా పవన్ పరోక్షంగా ఒక ఉపదేశం చేస్తున్నట్టుగా ఉంటుంది. అది ఎలా అంటే చంద్రబాబు తప్పులు చేస్తున్నాడు, పరిపాలన కూడా గొప్పగా లేదుకానీ 2019లో కూడా చంద్రబాబు అవసరం ఎపికి ఉంది…..కాబట్టి ఈ సారి కూడా చంద్రబాబు అనుభవం కోసం బాబుకే అవకాశం ఇవ్వండి అని చెప్పినట్టు ఉంటుంది.

పనిలో పనిగా నేను ప్రజల తరపున పోరాడుతున్నాను కాబట్టి నాకు కూడా కొన్ని ఓట్లు, సీట్లు ఇవ్వండి అని అడగడం పవన్ ఉద్ధేశ్యం. అంటే 2019 తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఆయన కోసం ఇప్పుడు పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడిగా సభలో ఉండాలన్నమాట. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా ముఖ్యమంత్రి పదవి కోరుకున్నప్పటికీ….ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టి ……ఆ మరుక్షణం నుంచీ ప్రజల మధ్యనే ఉంటూ…..ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న జగన్ మాత్రం రాజకీయాల్లో లేకుండా పోవాలన్నమాట. ఇక ఆ తర్వాత చంద్రబాబుని విమర్శించేవాడు ఉండడు. హామీలు అమలు చేయకపోయినా, ఏమీ చేయకపోయినా అడిగే దిక్కు కూడా ఉండదు. పవన్, చంద్రబాబుతో పాటు భజన మీడియా, బినామీలు మాత్రం హ్యాపీగా ఉంటారు. పవన్ ఎప్పుడైనా తలెగరేస్తే పవన్‌ పార్టీని పూర్తిగా క్లోజ్ చేయడం చంద్రబాబుకు క్షణాల్లో పని. పరకాల ప్రభాకర్‌ ఎవరి గూఢచారిగా ప్రజారాజ్యంలో చేరాడో……ఎవరి కోసం ఆ పార్టీని నాశనం చేశాడో…..ఏ బూతు పత్రికతో కలిసి డ్రామాలాడాడో…….ఇప్పుడు ఎందుకు అత్యున్నత స్థాయి పదవిలో ఉన్నాడో ఆవేశం మాత్రమే పవన్‌కి తెలియదేమో కానీ రాజకీయ మేధావులకు మాత్రం చాలా మందికి తెలుసు. సొంత బలంతో వచ్చిన చిరంజీవి పార్టీ జెండానే పీకేయించినవాళ్ళకు…..వాళ్ళ బలాన్నే తన బలం అనుకుంటున్న భ్రమల్లో ఉన్న పవన్‌ పార్టీ జెండాను పీకెయ్యడం ఎంత సేపు?

అయితే ఈ మొత్తంలో ప్రజా ప్రయోజనాలు మాత్రం పూర్తిగా నాశనమవుతాయేమో, ఎపి భవిష్యత్తు ఏంటో అనే అనుమానాలు మాత్రం వస్తున్నాయి. ఇక్కడ అవినీతి గురించి ప్రస్తావన అనవసరం. ఎందుకంటే ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా 2019 ఎన్నికల సమయానికి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా పోటీపడే అవకాశం చంద్రబాబు, జగన్‌లకు మాత్రమే ఉంది. పవన్ పార్టీకి ఆ అవకాశం లేదు. చంద్రబాబు, జగన్‌లిద్దరూ అవినీతిపరులే అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. ఇక్కడ ఒకరు ఎక్కువ తక్కువ అని చెప్పడానికి కూడా ఏమీ లేదు. కాకపోతే ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఆడియో, వీడియో సాక్ష్యాలతో అడ్డంగా దొరికాడు. జగన్ అవినీతి విషయంలో మాత్రం ఇప్పటి వరకూ నిరూపించింది ఏమీలేదు. కంటికి కనిపించకుండా చేస్తున్న అవినీతి విషయం పక్కన పెడితే కంటికి కనిపిస్తున్న రాజకీయాల విషయంలో మాత్రం చంద్రబాబుకంటే జగనే ఎక్కువగా విలువలు పాటిస్తున్నాడు. పార్టీ పెట్టినప్పటి నుంచీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీలో చేరాలనుకున్న నాయకులందరి చేతా రాజీనామా చేయించాడు. ఎన్టీఆర్ తర్వాత ఈ విషయంలో ఆ స్థాయిలో విలువలు పాటించింది జగనే. ఇక హామీల విషయంలో కూడా దొంగ హామీలతో గద్దెనెక్కాలన్న ఆలోచన, మోసపూరితంగా ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన జగన్‌కి ఉన్నట్టు అనిపించదు. అలాంటి ఆలోచనే ఉండి ఉంటే 2014లో జగన్ కూడా రుణమాఫీ హామీలు ఇచ్చి ఉండేవాడు. రుణమాఫీ హామీలు ఓట్లు కుమ్మరిస్తాయని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్యులకు కూడా తెలుసు. అలంటప్పుడు జగన్‌కి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ప్రజల సొమ్మే కాబట్టి పంచిపెట్టినా జగన్‌కి పోయేదేమీ లేదు. అయితే ఆ స్థాయిలో రుణమాఫీ చేయడానికి విభజనతో అన్నీ నష్టపోయిన ఎపి ఖజానాలో లేదని మాత్రం జగన్‌కి తెలుసు. అందుకే హామీలు ఇవ్వలేదు. అందుకే జగన్ ఓడిపోయాడు. నిజానికి అబద్ధాలతో కాలం వెళ్ళబుచ్చుతున్న, ముఖ్యమంత్రి పదవి కోసం అడ్డమైన హామీలు ఇఛ్చి జనాలను మోసం చేసిన చంద్రబాబుకు మద్ధతుగా నిలవడానికే మీడియా ఎక్కువ కష్టపడాలి. కానీ బాబు భజన మీడియా మాత్రం బ్రహ్మాండంగా భజన చేసి జనాలను మాయ చేసింది. సాక్షి మీడియా మాత్రం జగన్ చెప్పిన నిజాలను జనాల్లోకి తీసుకెళ్ళడంలో కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.

మూడున్నరేళ్ళ తర్వాత కూడా సాక్షి మీడియాది అదే పరిస్థితి అని మరోసారి నిరూపితమైంది. సినిమా షూటింగ్‌ల గ్యాప్‌లో జన్మానికో సారి అన్నట్టు జనాల మధ్యకు వచ్చే పవన్ కూడా ప్రజా సమస్యలపై పోరాడమని జగన్‌కి చెప్పేవాడయ్యాడు. ప్రజల సమస్యలపై స్పందించే ఏ నాయకుడైనా కూడా అధికారంలో ఉన్నవారిని విమర్శించడాన్నే ఇప్పటి వరకూ చూశాం. కానీ అధికారంలో ఉన్నవాళ్ళను వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ని తిట్టడం మాత్రం పవన్ స్టార్ట్ చేసిన కొత్త రాజకీయం. పడవ ప్రమాద మృతుల గురించి ఒక్క మాట మాట్లాడని పవన్, పుష్కర ప్రమాదంలో ముప్ఫైమంది చనిపోతే ఒక్క మాట మాట్లాడని పవన్…..కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టే అవకాశం వచ్చేసరికి పోలోమని వైజాగ్ వెళ్ళాడు. ఆ సమస్యపై కూడా వైకాపా ఎప్పుడో పార్లమెంట్‌లో చర్చిందింది. అయినప్పటికీ పవన్ మాత్రం జగన్ ప్రజల తరపున పోరాడడం లేదని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేశాడు. పార్టీ పెట్టిన మరుక్షణం నుంచీ కూడా జనాల మధ్యలోనే ఉంటూ…ప్రజల కోసమే పోరాడుతున్న జగన్‌ని విమర్శించే అర్హత షూటింగ్ గ్యాప్‌లో రాజకీయాలు చేసే పవన్‌కి ఉందా?

అయితే జగన్‌కి మద్ధతుగా నిలబడాల్సిన అన్ని సందర్భాల్లోనూ సాక్షి మీడియా అట్టర్ ఫ్లాప్ అవుతోంది. కనీసం చంద్రబాబు-పవన్‌ల తెరవెనుక దోస్తీని, పవన్ మాటల్లోని అబద్ధాలను హైలైట్ చేయలేకోయింది సాక్షి. ఇక బాబు, పవన్ ప్రచార ఊపును తట్టుకునేందుకు సాక్షి మీడియా కోసం జగన్‌ని కొమ్మినేని చేసిన ఇంటర్యూ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. సాక్షి మీడియా మొత్తం కూడా ఎల్లో మీడియా అధినేతల దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ప్రజాబలం పెంచుకోవడం కంటే ముందు …….ఆ ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే మీడియా బలాన్ని పెంచుకోకపోతే మాత్రం జగన్‌కి 2019లో కూడా చుక్కుదురు కావడం ఖాయం. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచినప్పటి నుంచీ కూడా కేవలం ఆ మీడియా బలంతో….ప్రచార పటాటోపంతో నెట్టుకొస్తున్న చంద్రబాబును చూసిన తర్వాత అయినా…..2014లో మోడీ మ్యాజికల్ ప్రచారాన్ని చూసిన తర్వాత కూడా జగన్‌కి జ్ఙానోదయం అవ్వకపోతే మాత్రం అత్యంత ప్రజాదరణ ఉండి కూడా అధికారంలోకి రాలేకపోయిన నేతగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -