Saturday, May 4, 2024
- Advertisement -

పవన్ నిస్వార్థంగా సేవ చేస్తున్నాడా? పదవీ కాంక్షలేదా? కహానీలు వద్దు… కఠిన వాస్తవాలు ఇవిగో

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…… మామూలు కమర్షియల్ సినిమా హీరోల స్థాయిలో కూడా నటించలేడు. నడవడం తప్ప డ్యాన్సులు చేయలేడు. ఇక లుక్స్ పరంగా కూడా మిగతా హీరోలతో పోలిస్తే ప్రత్యేకత ఏమీ ఉండదు. కామెడీ మాత్రం బాగా చేయగలడు. అయినప్పటికీ తెలుగు స్టార్ హీరోల్లో ఏ ఒక్క హీరోకీ లేని క్రేజ్ పవన్ సొంతం. ఏ స్టార్ హీరోకి లేనంత మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ పవన్‌కి ఉన్నారు. అది ఎలా సాధ్యమైంది. ‘గొప్పగా నటించడం చేతకాకపోయినప్పటికీ పవన్‌కి ఎక్కువ మంది ఫ్యాన్స్….అది కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండడానికి కారణం పవన్ వ్యక్తిత్వమే’….ఈ మాటలు స్వయానా పవన్ సోదరుడు నాగబాబే చెప్పారు. ఇక బండ్ల గణేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లాంటి వాళ్ళతో పాటు పవన్‌తో రకరకాల అవసరాలున్న సినిమా జనాలందరూ కూడా పవన్‌ని ఆకాశానికెత్తేశారు. దేవుడ్ని చేసి పడేశారు. లక్ష రూపాయల సాయం చేసి పది కోట్ల ప్రచారం పొందడం పవన్‌కే సాధ్యమైంది. అలాగే పవన్ కూడా కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లాంటి ఎన్నో పబ్లిసిటీ స్టంట్స్ కూడా చేశాడు. ‘డబ్బులన్నీ ఖర్చుపెట్టేసిన పవన్…రేపటి నుంచి మాకు జీతాలెలా ఇస్తాడు’ అన్న భయాన్ని పవన్ స్టాఫ్ కళ్ళలో నేను చూశాను అని చెప్పి తన రచనా సామర్థ్యాన్ని మొత్తాన్ని పవన్‌ని పొగడడానికి వాడేశాడు త్రివిక్రమ్. పవన్‌కి హైడ్రాబ్యాడ్, బెంగుళూరుల్లో ఉన్న ఫాం హౌస్‌లు, ఇళ్ళు, కోట్ల ఖరీదు చేసే కార్లను కూడా దానంగా ఇచ్చేశాడేమో తెలియదు మరి. కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌తో ఎంతమందికి సేవ చేశాడు? అసలు ఆ సంస్థకు ఇప్పుడు అస్థిత్వం ఉందా అని మాత్రం అడగకూడదు. అడిగినా పవన్ సమాధానం చెప్పడు.

ఆ విషయాలు పక్కనపెట్టి రాజకీయాల విషయానికి వద్దాం. ఇప్పటి వరకూ తెలుగు నాట పార్టీలు పెట్టిన పెద్ద హీరోలు ఎన్టీఆర్, చిరంజీవిలు జీవితాలను కాస్త రిస్క్‌లో పెట్టి రంగంలోకి దిగారు. మొదటి సారే అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్‌కి ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. కానీ చిరంజీవి మాత్రం అధికారంలోకి రాలేకపోయాడు. ఆ వెంటనే చుట్టుముట్టిన సమస్యలు, రాజకీయ విమర్శలు, తమిళనాడులో తన బంధువు ఇంట్లో కోట్లాది రూపాయల అక్రమ సొమ్ము పట్టుబడిన వ్యవహారాలతో సతమతమైపోయి ఎంచక్కా తన బిచాణా ఎత్తేసి తన పార్టీని కాంగ్రెస్‌కి అమ్మేశాడు. ఆయనను నమ్ముకుని 2009 ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టిన వాళ్ళు. చిరంజీవిని నమ్మి ఓట్లేసిన జనాలు మాత్రం నిండా మునిగిపోయారు. రాజకీయాలను, తెలుగు ప్రజల భవిష్యత్తును చిరంజీవి మామూలుగా ప్రభావితం చెయ్యలేదు. తన ఎమ్మెల్యేలను చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్మెయ్యకుండా ఉండి ఉంటే…తన పదవీ స్వార్థం చూసుకోకుండా ఉండి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ చనిపోయిన అనతి కాలంలోనే కూలిపోయి ఉండేది. అదే జరిగి ఉంటే రాష్ట్ర విభజన వ్యవహారాలతో సహా చాలా విషయాల్లో పరిణామాలు ఇంకోలా ఉండేవి అనడానికి సందేహించక్కర్లేదు. మొదటగా సమైక్యాంధ్ర వాదాన్ని వినిపించిన చిరంజీవి తెలంగాణా వాదులను రెచ్చగొట్టడంలో గట్టిగానే సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత సోనియమ్మ వారు తనకు రాజ్యసభ పదవితో పాటు పార్టీకి కూడా మంచి బేరాన్ని చూడడంతో సీమాంధ్రులను నిండా ముంచి ఎంచక్కా తను బాగుపడ్డాడు. పదవి పరంగా, ఆర్థికంగా లాభపడ్డప్పటికీ ఇమేజ్ పరంగా మాత్రం దారుణమైన దెబ్బలు తిన్నాడు చిరంజీవి.

ఎన్టీఆర్. చిరంజీవి ఎదుర్కున్న అనుభవాలన్నింటిపైనా పవన్‌కి స్పష్టత ఉంది. అలాగే ఎన్టీఆర్, చంద్రబాబులు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన, చిరంజీవికి చుక్కలు చూపించిన టిడిపి మీడియా బలం ఏంటో కూడా పవన్‌కు తెలుసు. అందుకే అత్యంత సేఫ్ మార్గాన్ని ఎంచుకున్నాడు. అధికారంలోకి రావడం ఖాయమని దేశం మొత్తానికి అర్థమైపోయిన మోడీకి సపోర్ట్ ఇచ్చాడు. టిడిపి అర్థబలం, మీడియా బలం తెలిసినవాడు కాబట్టే చంద్రబాబుకు అండగా నిలిచాడు. ఓడినా, గెలిచినా చంద్రబాబు రాజకీయ జమానా మహా అయితే రెండు టెర్మ్‌లకు మాత్రమే పరిమితం అన్న విషయం పవన్‌కి తెలుసు. అలాగే చంద్రబాబు తదనంతరం టిడిపి నిలబడే అవకాశాలు తక్కువే. నిలబడినా కూడా అప్పటికి జనసేన పార్టీ, నాయకుడిగా పవన్ కళ్యాణ్‌లు కాస్త నిలదొక్కుకుని ఉంటారు. ఒక వేళ పోటాపోటీగా ఉంటే ప్రత్యర్థి ఎప్పటికీ అధికారంలోకి రాకుండా ఉండేలా చేస్తూ ఇద్దరూ కూడా పొత్తుపెట్టుకుని అధికారాన్ని పంచుకుంటూ ఉంటారు. అదే జగన్‌తో అయితే ఇలాంటివి కుదరవు. పవన్ కంటే కూడా చిన్నవాడు జగన్. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితమంతా కూడా జగన్‌తో పోరాడాల్సిన పరిస్థితి. ఇదీ పవన్ కళ్యాణ్ గీసుకున్న పర్ఫెక్ట్ స్కెచ్. మామూలుగా అయితే ఇక్కడ పవన్ రాజకీయాన్ని నిందించాల్సింది ఏమీ లేదు. జయలలిత చనిపోియన తర్వాత నుంచీ ఆమె రాజకీయ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి రజినీకాంత్, కమల్ హాసన్, బిజెపిలాంటి వాళ్ళు భయంకర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే పవన్ నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు, పదవీకాంక్షలేదు అని భుజకీర్తులు తగిలించడమే ఆక్షేపణీయం. చంద్రబాబు, జగన్‌లలాగే పవన్ కూడా ఒక రాజకీయ నాయకుడు అంటే సమస్యే ఉండదు.

పవన్‌కి పదవీ కాంక్షలేదు, నిస్వార్థపరుడు, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు అని వాదించేవాళ్ళందరూ ఈ క్రింది ప్రశ్నలకు బూతులతో కాకుండా మాటలతో సమాధానాలు చెప్పగలరా?

1.ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా అన్న పవన్ కళ్యాణ్ 2014 తర్వాత నుంచీ ఇప్పటి వరకూ కూడా ఏనాడైనా చంద్రబాబుని డైరెక్ట్‌గా ప్రశ్నించాడా?

2.పడవ ప్రమాదంలో 22 మంది చనిపోతే ఇప్పటి వరకూ పవన్ ఎందుకు ప్రశ్నించలేదు? స్పందించలేదు. పవన్ దృష్టిలో అది పట్టించుకోవాల్సిన విషయం కాదా? కనీసం ట్విట్టర్‌లో కూడా ఎందుకు స్పందించలేదు?

3.ప్రత్యేక హోదాని తుంగలో తొక్కిన పాపంలో చంద్రబాబు పాత్రను పవన్ ఏనాడైనా ప్రశ్నించాడా? ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌లాంటి విషయాల్లో మోడీ ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేశాడన్నది నిజం. అలాగే నాదీ మోడీది అభివృద్ధి జోడీ…..పదిహేనేళ్ళు ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తా అని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు……ఆ తర్వాత మాత్రం ఓటుకు నోటు భయమో, ఇంకే అక్రమ వ్యవహారాల విషయమో తెలియదుకానీ మోడీకి సాగిలపడ్డాడు. మోడీ దగ్గర చంద్రబాబు సాగిలపడ్డాడు అన్న విషయాన్ని చంద్రబాబుతో సహా టిడిపి నాయకులు, ఎల్లో మీడియా కూడా ఒప్పుకుంటుంది. కానీ ఆ సాగిలపడింది మాత్రం రాష్ట్రప్రయోజనాల కోసమే అని నమ్మబలుకుతుంది. కానీ నాలుగేళ్ళలో కేంద్రం దగ్గర సాగిలపడి చంద్రబాబు సాధించింది ఏంటి? హోదాకి మంగళం పాడాడు. ప్యాకేజీ అన్నాడు. ఇప్పుడు ప్యాకేజ్ నిధులు కూడా ఇవ్వడం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. పోలవరం నిధులు కూడా ఇవ్వడం లేదని చంద్రబాబే ఆవేధన వ్యక్తం చేస్తాడు. రైల్వేజోన్ లేదు, ఆర్థిక లోటు తీర్చింది లేదు, రాజధాని నిధులు ఇవ్వడం లేదు…….మొత్తంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒరుగుతున్నది ఏమీ లేదు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాడు. తనకు, తన పార్టీ నాయకులకు రాజకీయ, ఆర్థిక స్వార్థానికి సంబంధించిన విషయాల్లో మాత్రం గొప్ప గొప్ప సాయాలే పొందుతున్నాడు. ఇక ఓటుకు నోటులాంటి కేసుల్లో పురోగతి లేకుండా చూసుకుంటున్నాడు. అలాగే కెసీఆర్‌తో కూడా చంద్రబాబుది సేం టు సేం స్టైల్. 2014 ఎన్నికల సమయంలో కెసీఆర్‌తో జగన్ లాలూచీ పడ్డాడు. జగన్ గెలిస్తే తెలంగాణాతో పోరాడి గెల్చుకోవాల్సిన సీమాంధ్ర ప్రయోజనాలు వచ్చేలా చేయలేడు అని విషప్రచారం చేశారు. ఇప్పుడు కెసీఆర్‌తో చంద్రబాబు, ఎల్లో మీడియా ఏ స్థాయిలో కలిసిపోయిందో పవన్‌కి తెలియదా? ఈ మొత్తం విషయాలపైన పవన్ ధైర్యంగా మాట్లాడగలడా? చంద్రబాబు-మోడీల మధ్య బంధం రెండేళ్ళ క్రితమే తెగిపోయింది. అయితే రాజకీయ స్వార్థం కోసం ఇద్దరు నామ్‌కే వాస్తే కలిసి ఉన్నారు అన్నది నిజం. జగన్-పవన్‌లాగే మోడీ-చంద్రబాబులు కూడా ఒకళ్ళకొకళ్ళు పోటీదారులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మోడీ హైద్రాబాద్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేస్తా అని సిఎం హోదాలో చంద్రబాబు మాట్లాడిన మాటలు మోడీ అంత త్వరగా మర్చిపోడు. మోడీని చంద్రబాబు కూడా నమ్మడు. కానీ తనపై ఉన్న కేసులు, అక్రమ వ్యవహారాల భయంతో మోడీని విమర్శించలేడు. పవన్ చేత ఆ పని చేయిస్తుంటాడు. అది నిజం. ఒకవేళ అది నిజం కాకపోతే ప్రత్యేక హోదా, ప్యాకేజ్‌లాంటి విషయాల్లో మోడీని విమర్శించే పవన్…….మోడీ డ్రామాలను సమర్థిస్తున్న చంద్రబాబును ఎందుకు పల్లెత్తు మాట కూడా అనడు? ప్రత్యేక హోదాకు సంబంధించి తాజా అప్డేట్ ఏంటంటే ఆ హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా రాయితీలను మరికొంత కాలం పొడిగించింది కేంద్రం. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న, జరిగిన పోరాటాలకు భయపడి కేంద్రం హోదాను పొడిగించింది. ఈ విషయాన్ని ఎల్లో మీడియా ఎలాగూ ప్రస్తావించదు. హోదా ముగిసిన అధ్యాయం అని నమ్మబలికిన చంద్రబాబు కూడా మాట్లాడడు. మరి పవన్ కళ్యాణ్‌కి ఏమైంది?

4.ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టిన మూడున్నరేళ్ళ పైబడిన కాలంలో ఏనాడైనా చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించాడా? పుష్కర ప్రమాదం సమయంలో రాజకీయంగా వాడుకోవడం ఇష్టంలేకే మాట్లాడడం లేదు అన్న పవన్ ……ఆ తర్వాత అయినా ఎందుకు మాట్లాడడం లేదు? పుష్కర ప్రమాదం ఎవరి వళ్ళ జరిగింది? ఎందుకు జరిగింది? అనే విషయాలను ప్రభుత్వ కమిటీ తేల్చిందా? బాధ్యులను శిక్షించారా? అని పవన్ ఎందుకు ప్రశ్నించడు? తుని ప్రమాదం విషయం ఏంటి? ఎన్నికల సమయంలో కాపులకు రిజర్వేషన్స్ ఇస్తానని తనంతట తానే వరాల వర్షం కురిపించిన చంద్రబాబు….కాపు రిజర్వేషన్స్ కోసం కూడా షరా మామూలుగా ఓ కమిటీ వేశాడు. ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? ఇంకో ఏడాదికంటే తక్కువ వ్యవధిలోనే ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. అప్పుడు చేసేది ఏమీ ఉండదు. 2019లో ఓట్ల కోసం మరోసారి మాయ మాటలు చెప్పేదే ఉంటుంది. మరి కాపు రిజర్వేషన్స్ ఏమైంది చంద్రబాబు అని పవన్ ఎందుకు ప్రశ్నించడు?

5.సీమాంధ్రకు సంబంధించి అర్థ శతాబ్ధానికి పైగా కాలంలో మన ముఖ్యమంత్రులు చేసిన అప్పుకంటే కేవలం మూడేళ్ళలో అంతకుమించిన అప్పులు చేశాడు చంద్రబాబు. ఆ అప్పులన్నీ కూడా తెలంగాణా రాష్ట్ర పౌరుడు, తెలంగాణా రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న చంద్రబాబు కుటుంబం, రామోజీరావు, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ కుటుంబాలపైన పడకపోవచ్చు. కానీ ఆ అప్పులన్నీ కూడా సీమాంధ్రుల నెత్తికి చుట్టుకునే ఉంటాయి. మరి ఎందుకు ఆ స్థాయిలో అప్పులు చేస్తున్నావు అని పవన్ కళ్యాణ్ ఏనాడైనా ప్రశ్నించాడా?

6.ఒక ఇళ్ళు కట్టడానికి కూడా బోలెడంత టైం పడుతుంది….రాజధాని నిర్మాణం అంత అర్రీ బుర్రీగా అయిపోతుందా అని చంద్రబాబు, ఎల్లీ మీడియా, టిడిపి భక్తులు దబాయిస్తారు కానీ మూడున్నరేళ్ళ కాలంలో శాశ్విత నిర్మాణాలకు సంబంధించి ఒక్క ఇటుక పడింది లేదు, కనీసం పునాదులు తవ్వింది కూడా లేదంటే ఇక చంద్రబాబు చెప్పే రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? ఇప్పుడు బ్రతికున్నవాళ్ళు ఎవరైనా ఆ రాజధానిని చూడగలరా? లేకపోతే జీవితాంతం గ్రాఫిక్స్ బొమ్మలను ఊహించుకోవాల్సిందేనా?

ఇలా ప్రశ్నించుకుంటూ పోతే ఎన్నో? కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడు. రాజకీయాల్లోకి రావడం వళ్ళ ఈ మూడేళ్ళలో పవన్ కళ్యాణ్ నష్టపోయింది అంటూ ఏమీ లేదు. కోట్లు వదులుకుని పవన్ ప్రజాసేవకు వచ్చాడన్న మాటలో అర్థమే లేదు. ఆయన నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు, ఇప్పుడు నటిస్తున్న సినిమాలకుగానూ ఒక్కో సినిమాకు ఇరవై కోట్లకు పైగానే రెమ్యూనేరేషన్ అందుకున్నాడు పవన్. ఇంకా ఆ సినిమాలను కొన్నవాళ్ళు మాత్రం రోడ్డున పడ్డారు. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాను కొన్నవాళ్ళయితే పవన్ చుట్టూ ఉన్న మాఫియా మమ్మల్ని బెదిరించిందని వాపోయారు. నిరాహారదీక్షలు చేశారు. కానీ పట్టించుకున్న వాళ్ళు లేరు. తెలుగునాట బలంగా ఉన్న టిడిపి మీడియా మొత్తం ఇప్పుడు పవన్ తప్పులు బయటపడకుండా చూస్తోంది కదా…..ఇక భారీ రేటుకు ఆయా సినిమాలను ఎవరు కొనమన్నారు? అని వాదించే వాళ్ళు కూడా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలలోకి పవన్ గొప్పోడు. సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు తిరిగిచ్చేస్తాడు అని ఎందుకు ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని నమ్మే……పవన్‌కి డబ్బంటే ఇష్టం లేదు, డబ్బులు తిరిగిచ్చేస్తాడు అన్న మాటలు నమ్మే పవన్ అభిమాని అయిన ఒకాయన సర్దార్ సినిమాని కొని నిండా మునిగాడు. కాస్తైనా సర్దుబాటు చేయమని పవన్‌ని అడిగితే ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు……‘అంతు తేలుస్తాం’ అని ఆ పవన్ అభిమానిని బెదిరించారు. అంటే ప్రచారం ఏమో గొప్పగా, పవన్ కళ్యాణ్ ఒక రుషి, యోగి, మగానుభావుడు అనేలా చేస్తారన్నమాట. ఆ అబద్ధాలు నమ్మి ఎవడైనా మునిగిపోతే ఇక పవన్ బాధ్యత ఏమీ ఉండదన్నమాట. సినిమాల్లోనే కాదు……పాలిటిక్స్‌లో కూడా పవన్ చేస్తోంది అదే. 2014లో పవన్ మాటలు నమ్మి ఓటేసిన జనాలు…..బాధ్యత తీసుకోమని పవన్‌ని అడిగితే హ్యాండ్సప్ అన్నాడు పవన్.

ఇక జగన్ ఓట్లను కొల్లగొట్టడం కోసం పవన్ కళ్యాణ్ క్రిష్టియన్ పాట పాడలేదు అని కొంత మంది అంటున్నారు. త్రివిక్రమ్ సినిమాది కేవలం సినిమా పోస్టర్ అంటున్నారు. కేవలం సినిమాలు తీయడం పవన్ ఎప్పుడో మానేశాడు? తన రాజకీయ ప్రయోజనాలకు కోసం సినిమాను అడ్డంగా వాడేస్తున్నాడు. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలో క్షత్రియ వర్సెస్ కాపు విషయాన్ని బాగానే టచ్ చేశాడు. ‘కాపు కాసినప్పుడు నా కులం ఏంటో తెలియలేదా?’ అన్న డైలాగ్‌ని వాంటెడ్‌గా రాయించాడు. ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మూడు పెళ్ళిళ్ళ విషయం ఏంటయ్యా అంటే అది తన వ్యక్తిగతం అన్న పవన్…….తన భార్య క్రిష్టియన్….తను కూతురికి క్రిష్టియన్ పద్ధతుల్లోనే పెంచుతున్నాను అని బహరింగ సభలో చెప్పాడు. కుల మతాలకు అతీతుడ్ని అని చెప్పుకునే పవన్ మతాన్ని వాడుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? మొత్తం విషయాలు పరిశీలిస్తే పవన్ కూడా ఫక్తు, రొటీన్ రాజకీయ నాయకుడే. పదవి కోసం, ప్రయోజనాల కోసం రాజకీయం చేసేవాడే. కాకపోతే చంద్రబాబు అడుగుజాడల్లోనే ప్రజల కోసం అనే ముసుగును మాత్రం బ్రహ్మాండంగా వేయగలుగుతున్నాడు…….దట్సాల్……

ఆవేశంతో, ఆగ్రహంతో, బూతులతో కాకుండా మీ అభిప్రాయాలు తెలియచేయాలంటే మాత్రం కామెంట్స్‌లో స్పందించండి. సంస్కారాన్ని వదిలేసి మాట్లాడారంటే మాత్రం పైవన్నీ నిజాలనీ మీరు కూడా ఒప్పుకున్నట్టే అవుతుంది. సమాధానం చెప్పలేనివాడే బూతులకు, గొడవలకు దిగుతాడు. అండ్ వైఎస్ జగన్ రాజకీయ స్వార్థం, అవినీతి, మత రాజకీయాల గురించి మరోవ్యాసంలో కచ్చితంగా చర్చిద్దాం………

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -