Saturday, May 4, 2024
- Advertisement -

తెలుగుదేశం.. కాంగ్రెస్ పెళ్లి అంత తేలిక కాదు

- Advertisement -

తెలుగుదేశం పార్టీ ఈసారి కాంగ్రెస్‌తో క‌లిసి బ‌రిలోనికి దిగ‌బోతుందంటూ గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. బీజేపీతో తెగ‌తెంపులు చేసుకున్న త‌ర్వాత‌.. చంద్ర‌బాబునాయుడు కాంగ్రెస్ అధిష్ఠానంతో సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ఉండ‌డం గ‌త కొంత‌కాలంగా క‌నిపిస్తోంది. క‌ర్నాట‌క‌లో జ‌రిగిన కుమార‌స్వామి ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మంలో రాహుల్‌గాంధీ, చంద్ర‌బాబు ఒక‌రినొక‌రు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకోవ‌డం, ప‌క్క‌ప‌క్క‌నే నిల‌బ‌డి.. ప్ర‌జ‌ల‌కు అభివాదం చేయ‌డం లాంటివి కాంగ్రెస్‌, తెలుగుదేశం మైత్రి జ‌ర‌గ‌నుంద‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూర్చాయి. అయితే.. దీనిపై అధికారికంగా చంద్ర‌బాబునాయుడు, ఏపీ కాంగ్రెస్ పెద్ద‌లు ఎప్పుడూ నోరు విప్పింది లేదు. కానీ.. తాజాగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఈ విష‌యంపై మాట్లాడారు. తెలుగుదేశం కాంగ్రెస్‌ను ఆరో పెళ్లి చేసుకోబోతోందంటూ వ్యంగ్యంగా త‌న పాద‌యాత్ర బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్‌ చెప్ప‌డంతో.. మ‌రోసారి ఈ అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే.. జ‌గ‌న్ ఈ మాట అన్నందుకు అటు తెలుగుదేశం పార్టీ, ఇటు కాంగ్రెస్ నాయ‌కులు కూడా అగ్గిమీద గుగ్గిలం అయి.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. జ‌గ‌న్ ఏమైనా మ్యారేజ్ బ్యూరో పెట్టాడా.. తెలుగుదేశంతో త‌మ‌కు పెళ్లి చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడంటూ ఏపీసీసీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌డ‌డం చూసి.. ఎక్క‌డ త‌న పార్టీ మునిగిపోతుందోన‌నే భ‌యంతోనే జ‌గ‌న్ ఇలాంటి దుష్ర్ప‌చారం చేస్తున్నాడ‌ని, త‌న ప‌త్రికా ఆఫీసును మ్యారేజ్ బ్యూరో కార్యాలయ‌గా మార్చి.. తెలుగుదేశం, కాంగ్రెస్‌కు సంబంధాలు కుదురుస్తున్నాడంటూ ఏఐసీసీ కార్య‌ద‌ర్శులు కృష్ణోప‌ర్‌తిల‌క్‌, ముయ్య‌ప్ప‌న్‌, ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్.ఎన్‌.రాజా త‌దిత‌రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్‌, తెలుగుదేశం పొత్తు అనేది ఎట్టిప‌రిస్థితుల్లోనూ కుదిరే అంశం కాదు. కాంగ్రెస్ పార్టీని గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు పూర్తిగా పాతాళంలో పాతేశారు. విచిత్రంగా ఇంత ప‌రాభ‌వం జ‌రిగినా.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులెవ‌రూ ఇత‌ర పార్టీల్లోనికి పెద్ద‌గా వెళ్లింది లేదు. ఎక్క‌డో అక్క‌డ‌క్క‌డా త‌ప్ప‌.. అదికూడా ఎన్నిక‌ల‌కు ముందే వెళ్లిపోయిన వాళ్లు త‌ప్ప మిగ‌తా వారంతా ఐదేళ్లుగా అలాగే పార్టీలోనే ఉన్నారు. అయితే.. రాష్ట్రంలోని ప‌రిస్థితుల నేప‌థ్యంలో స్త‌బ్ధుగా ఎక్క‌డిక‌క్క‌డ ఉండిపోయారు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, బొత్స స‌త్స‌నారాయ‌ణ లాంటి ఒక‌రిద్ద‌రు త‌ప్ప మిగ‌తా వారంతా కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతున్నారు. తాజాగా వారంద‌రినీ మ‌ళ్లీ ఏక‌తాటిపై న‌డిపించేందుకు రాహుల్‌గాంధీ నేతృత్వంలో క‌స‌ర‌త్తు ఆరంభించారు. వెళ్లిపోయిన కిర‌ణ్‌కుమార్‌రెడ్డి లాంటి సీనియ‌ర్ నాయ‌కుల‌ను మ‌ళ్లీ పార్టీలోనికి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లోనూ పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌లోనే కాంగ్రెస్ ఉంది. ఇప్ప‌టికే 43వేల‌కు పైగా బూత్‌క‌మిటీల‌ను నియ‌మించుకున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ స్థాయి స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌జా వ్య‌తిరేఖ విధానాల‌పై మిగ‌తా పార్టీల కంటే ముందుండి పోరాటం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగుదేశంతో పొత్తంటే.. అస్స‌లు కుద‌ర‌ని ప‌ని. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇప్ప‌టికీ కాంగ్రెస్‌కు బ‌ల‌మైన నాయ‌క‌త్వం, కార్య‌క‌ర్త‌లున్నారు. వారంతా ఎన్నిక‌ల్లో నిల‌బ‌డాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. తెలుగుదేశంతో పొత్తంటే.. గ‌ట్టిగా ఇస్తే చంద్ర‌బాబు ఓ 20 సీట్ల‌ను ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. అదికూడా అత్య‌ధికంగా ఇస్తే.. 20 ఇస్తారు. లేదంటే ప‌దికి అటూ ఇటూ ఇచ్చేందుకే చంద్ర‌బాబు ముందుకొస్తారు. అవి.. కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఏమూల‌కూ చాల‌వు. చంద్ర‌బాబుతో పెళ్లంటే.. అత‌ను ఇచ్చే ఈ క‌ట్నంతో స‌రిపెట్టుకోవ‌డం.. ద‌శాబ్దాల చ‌రిత్ర ఉండి.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనేక‌సార్లు అధికారం కైవ‌సం చేసుకుని చ‌క్రం తిప్పిన కాంగ్రెస్‌కు ఏమాత్రం చాల‌వ‌ని ఆ పార్టీకి చెందిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు ఆద్య న్యూస్‌తో అన్నారు. పైగా.. చంద్ర‌బాబు సైతం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని సాధించేదేమీ ఉండ‌దు. వారి కుమ్ములాట‌ల‌ను త‌మ పార్టీలోనికి రుద్దుకోవ‌డం త‌ప్ప‌.. ప్ర‌యోజ‌నం ఉండ‌దని, పైగా కాంగ్రెస్‌ను వ్య‌తిరేకిస్తూ పుట్టిన తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌కే ఇది మాయ‌ని మ‌చ్చ‌గా మార‌నుంద‌ని బాబు భావిస్తున్న‌ట్టు ఆ పార్టీ నాయ‌కులు పేర్కొంటున్నారు. షో ఎలా చూసినా.. ఈ రెండు పార్టీల పొత్త‌నేది కేవ‌లం ఊహాజ‌నిత‌మే త‌ప్ప‌.. ఆచ‌ర‌ణ సాధ్యం కాద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అంగీక‌రిస్తున్న వాస్త‌వం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -