బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అతను టాప్ ప్లేస్‌లో నిలిచాడు. భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్లలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రెండవ ప్లేయర్‌గా శ్రీకాంత్ నిలిచాడు. మాడ్రన్ ర్యాంకింగ్స్‌లో సైనా నెహ్వాల్ కూడా ఎలైట్ లిస్టులో ఉంది.
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఈ రోజు ప్రకటించిన జాబితాలో 76,895 పాయింట్లతో శ్రీకాంత్ తొలి స్థానంలో నిలిచాడు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అక్సెల్సన్ ను రెండో స్థానంలోకి నెట్టేశాడు. 1980లో కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ పద్ధతి లేనప్పుడు భారత్ కు చెందిన ప్రకాశ్ పదుకునే నంబర్ వన్ స్థానాన్ని సాధించాడు. ఇన్నేళ్ల తర్వాత మరో భారతీయుడు ఈ ఘనతను సాధించడం ఇదే ప్రథమం.
ప్రస్తుత వరల్డ్ టాప్ ఫైవ్ ప్లేయర్స్ వీరే…
కిడాంబి శ్రీకాంత్ – ఇండియా – 76,895 పాయింట్లు
విక్టర్ అక్సెల్సన్ – డెన్మార్క్ – 75,470 పాయింట్లు
సోన్ వాన్ హో – కొరియా – 74,670 పాయింట్లు
చెన్ లాంగ్ – చైనా – 73, 466 పాయింట్లు
షీయుకీ – చైనా – 72,743 పాయింట్లు
ప్రపంచ నంబవర్ వన్ స్థానానికి ఎదిగిన కిడాంబి శ్రీకాంత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తొలి స్థానాన్ని సాధించిన రెండో భారతీయుడిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉందని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. భారతీయ క్రీడా రంగానికి ఈ రోజు గొప్పరోజు అని అన్నాడు. మరోవైపు గోపీచంద్ మాట్లాడుతూ, శ్రీకాంత్ కే కాకుండా భారత బ్యాడ్మింటన్ కు ఇదొక గొప్ప విజయమని చెప్పాడు. ఇప్పటి వరకు మనమంతా మహిళా క్రీడాకారుల గురించే మాట్లాడుకున్నామని… ఇప్పుడు మనకు మెన్స్ నెంబర్ వన్ కూడా ఉన్నాడని తెలిపాడు. రానున్న రోజుల్లో శ్రీకాంత్ మరింత మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తాడని చెప్పాడు.
