ఆస్ట్రేలియాతో క్రికెట్ అంటే స్లెజ్జింగ్ ఉండాల్సిందే. అది ఏస్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్లెజ్డింగ్ తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో అంతంతమాత్రంగానే కనిపించినా.. మూడో టెస్ట్‌కు వచ్చేసరికి అది తీవ్రరూపం దాల్చింది. ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శల వరకు దారి తీసింది.
ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ల మధ్య నడిచిన మాటల తూటాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ స్లెజ్డింగ్ మరింత వివాదానికి దారి తీస్తుందని క్రికెట్ అభిమానులు కలవర పడ్డారు. అయితే ఆటలో ఇదంతా సహజమేనని..మైదానం దాటిన తర్వాత అందరం స్నేహితలమే అన్నది నిరూపించారు రిషబ్.
మూడోటెస్ట్‌లో టిమ్‌పైన్.. ‘పంత్.. నా పిల్లలను ఆడించు.. నేను నా భార్యను సినిమాకు తీసుకెళ్తా!’ అని సరదాగా అన్న వ్యాఖ్యలను పంత్ సీరియస్‌గా తీసుకున్నాడో ఏమో కానీ అతను అన్నట్లే పైన్ సతీమణి బొనీపైన్‌ను కలిసి వారి పిల్లలను ఆడించాడు. ఈ విషయాన్ని బొనీయే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.అంతేకాకుండా పంత్ బెస్ట్ బేబీసిట్టర్ అని కొనియాడింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా చివరి టెస్ట్ ప్రారంభంకానుంది.
