కేప్‌టౌన్‌లో తొలి టెస్టులో కోహ్లి సేన ఓటమి తర్వాత భారత జట్టు కూర్పుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. విదేశీ గడ్డపై అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న అజింక్య రహానేను కాదని రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు కల్పించడం, కేఎల్ రాహుల్‌ను పక్కనబెట్టడం పట్ల విమర్శలు వచ్చాయి. ఇటీవలి ప్రదర్శన ఆధారంగానే రోహిత్‌కు అవకాశం కల్పించామని కోహ్లి తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.
రెండో టెస్టులో కేఎల్ రాహుల్, అజింక్య రహానేలకు తుది జట్టులో చోటు కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా, జట్టులో ఎలాంటి మార్పులు చేయొద్దని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సూచిస్తున్నాడు. జట్టులో మార్పులు చేయవద్దని, ప్రస్తుత బ్యాటింగ్ లైనప్ పై నమ్మకం కొనసాగించాలని సూచించాడు.
కేప్ టౌన్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమి చవిచూసిన అనంతరం జట్టు మేనేజ్ మెంట్ రాణించకపోయినా రోహిత్ శర్మను కొనసాగించాలని, విదేశాల్లో మంచి రికార్డులు కలిగిన అజింక్య రహానేను అలాగే బెంచ్ పైనే ఉంచాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
తొలి టెస్ట్ మ్యాచు రెండు ఇన్నింగ్స్ లలో రోహిత్ 21 పరుగులే చేశాడు. ఓపెనర్లు అయిన శిఖర్ ధావన్ యథాప్రకారం అవుట్ కావడంతో అతడ్ని మార్చి కేఎల్ రాహుల్ కు చోటివ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. మొదటి టెస్ట్‌లో బౌలర్లు రానించినా బ్యాటింగ్ వైఫల్యం చెందింది. కాబట్టి బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజులో ఉండి, పరుగులు చేయడానికి ప్రయత్నించాలి.
విరాట్ కోహ్లి ఈ విషయాల గురించి చింతించొద్దు. కేఎల్ రాహుల్, రహానేలకు విదేశాల్లో మెరుగైన రికార్డ్ ఉంది. కానీ కోహ్లి ప్రస్తుత ఫామ్‌ను బట్టి జట్టును ఎంపిక చేశాడు. రెండో టెస్టులోనూ అదే కొనసాగించాలని గంగూలీ సూచించాడు.. ప్రతీ మ్యాచ్ కు జట్టులో మార్పులు చేయరాదని, ప్రస్తుత బ్యాటింగ్ పై నమ్మకం ఉంచాలని అభిప్రాయపడ్డాడు. ఇంకా టెస్ట్ మ్యాచులు ఉన్నందున వాటిలో మంచి ఫలితాలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.
