ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషాన్..8వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 732 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు. దీంతో అతను న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సైఫర్ట్, ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్లను వెనక్కు నెట్టాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో టాప్-10లో నలుగురు భారత బ్యాటర్లు ఉన్నారు.
గత ఐసీసీ అప్డేట్ తర్వాత ఇషాన్ నమీబియా పై 61, పాకిస్థాన్‌పై 77 పరుగులు చేయడంతో భారీగా పాయింట్లు సాధించాడు. మరోవైపు అభిషేక్ శర్మ 891 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ 83 పాయింట్లు వెనుకబడి రెండో స్థానంలో ఉన్నాడు.
టాప్-10లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు. పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ భారత్‌పై డక్ కావడంతో ఐదో స్థానానికి పడిపోయాడు. శ్రీలంక ఆటగాడు పతుమ్ నిస్సాంకా ఆస్ట్రేలియాపై సెంచరీతో మూడో స్థానానికి చేరాడు.
ఆల్రౌండర్లలో పాకిస్థాన్‌కు చెందిన సైమ్ అయూబ్ అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకోగా, హార్ధిక్ పాండ్యా మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా రెండో స్థానంలో ఉన్నాడు. బౌలర్లలో జింబాబ్వే ఆటగాడు బ్రాడ్ ఎవాన్స్ 680 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకాడు.
