నరేంద్ర మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్కు మద్దతు తెలిపిన రాహుల్ అన్నదాతల్ని దోచుకునే ప్రయత్నం మానుకుని, వారి సంక్షేమానికి పాటుపడాలని హితవు పలికారు. ఇకనైనా కళ్లు తెరవాలని అన్నారు ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇక రైతులకు నష్టాలు తెచ్చే వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఆయన ఇదివరకే మోదీ ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు చేశారు. రైతుల ఆందోళనలకు ముందునుంచీ మద్దతు తెలుపుతున్నారు. కొన్ని రోజుల కిందట వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాల్లో ఆయన ‘ఖేతి బచావో యాత్ర’ కూడా చేపట్టారు.
మోదీ తన అనుయాయులకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చారని విమర్శించారు. వాటివల్ల రైతులకు ఒరిగేదేం లేదని వ్యాఖ్యానించారు. ఇక తమ పొట్టమీద కొట్టే నల్ల చట్టాలను ఉప సంహరించుకోవాలని రైతన్నలు దేశరాజధానికి చేరుకుని నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చర్చలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో నేడు (డిసెంబర్ 8) అన్నదాతలు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. విపక్షపార్టీలన్నీ ఈ బంద్ కార్యక్రమానికి మద్దతు తెలిపాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైయెస్సార్ కాంగ్రెస్ పార్టీలు రైతుల నిరసనలకు మద్దతు ప్రకటించాయి.
