ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది….?బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై ఆ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారా…? అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురందేశ్వరి సాధించిందేంటీ?అందుకే తెలంగాణలో బండి సంజయ్‌పై యుద్ధం ప్రకటించినట్లుగానే పురందేశ్వరిపై నేతలు ఒక్కటై ఆమెను గద్దె దించుతారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని దించే వరకు అసమ్మతి నేతలు పోరాటం ఆపలేదు. బండిపై నిత్యం ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ చివరికి అనుకున్నది సాధించి బండిని పదవి నుండి దించేశారు. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే జరగబోతోందా అంటే బీజేపీ నేతలు అవుననే చెబుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు పురందేశ్వరిపై అసహనం వ్యక్తం చేయగా తాజాగా బీజేపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.
బీజేపీ ప్రయోజనాల కంటే టీడీపీ ప్రయోజనాల కోసమే ఎక్కువగా పురందేశ్వరి పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేవలం తన సామాజిక వర్గానికే పురందేశ్వరి పెద్దపీట వేస్తోందని విజయవాడలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 37 ఏళ్లుగా తాను బీజేపీలో ఉన్నానని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. అందుకే పురందేశ్వరి హఠావో…బీజేపీ బచావో నినాదాన్ని ఎంచుకున్నారు. పురందేశ్వరి రాజకీయ ప్రస్థానం అంతా స్వార్ధ రాజకీయాలేనని ఆయన మండిపడ్డారు. ఏపీ అధ్యక్ష బాధ్యతల నుండి పురందేశ్వరి తప్పుకోవాలని లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాను చేస్తున్న ఆరోపణలు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త చేస్తున్నదని తెలిపారు. ఇక సుబ్బారెడ్డి చేసిన ఆరోపణలను ఏ ఒక్క బీజేపీ నేత ఖండించకపోవడం పురందేశ్వరికి ఇబ్బందికర పరిణామమేనని వాదన వినిపిస్తోంది. మొత్తంగా రానున్న రోజుల్లో ఆమెను బండి సంజయ్ మాదిరిగానే పదవి నుండి దింపే వరకు బీజేపీ నేతలు నిద్రపోయేలా కనిపించడం లేదు.
