ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ను భారత్‌లో ఆడాలి లేదా పాయింట్లు కోల్పోవాల్సి వస్తుందంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తమకు అల్టిమేటం ఇచ్చిందన్న వార్తలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) బుధవారం ఖండించింది. భద్రతా కారణాలను పేర్కొంటూ టీ20 వరల్డ్‌కప్‌లో తమ మ్యాచ్‌లను వేరే చోటుకు మార్చాలని ఐసీసీకి బీసీబీ లేఖ రాసిన నేపథ్యంలో, కొన్ని మీడియా వర్గాలు ఇలాంటి కథనాలు ప్రచురించాయి. అయితే అవి పూర్తిగా అవాస్తవమని బీసీబీ స్పష్టం చేసింది.
ఈ అంశంపై ఐసీసీ నుంచి తమకు ఇప్పటికే స్పందన వచ్చిందని, దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని బీసీబీ తెలిపింది. జనవరి 7 సాయంత్రం క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌తో బీసీబీ డైరెక్టర్లు సమావేశం కానున్నారని వెల్లడించింది.
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ 2026 సందర్భంగా భారత్‌లో బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు భద్రతపై బీసీబీ వ్యక్తపరిచిన ఆందోళనలకు, అలాగే మ్యాచ్‌ల మార్పు అభ్యర్థనకు సంబంధించి ఐసీసీ నుంచి స్పందన అందింది” అని బీసీబీ ప్రకటనలో తెలిపింది.
ఈ కమ్యూనికేషన్‌లో టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ జట్టు పూర్తిస్థాయిలో, ఎటువంటి అంతరాయం లేకుండా పాల్గొనేలా చూసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఐసీసీ స్పష్టం చేసిందని బీసీబీ తెలిపింది. భద్రతా ప్రణాళికలో బీసీబీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తామని ఐసీసీ హామీ ఇచ్చిందని పేర్కొంది.
