సంక్రాంతి పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు పెద్ద గుడ్న్యూస్ అందించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల చేస్తూ, ఉద్యోగుల ఇళ్లల్లో నిజమైన పండుగ ఆనందాన్ని నింపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో మొత్తం సుమారు రూ.1100 కోట్ల మేర నిధులు జమయ్యాయి.
2019 నుంచి దాదాపు 60 నెలలుగా నిలిచిపోయిన డీఏ బకాయిలను కూటమి ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. దీని వల్ల సుమారు 2.25 లక్షల మంది CPS ఉద్యోగులు, మరో 2.70 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా నగదు లాభం చేకూరింది. ఒక్కో ఉద్యోగి ఖాతాలో వారి మూల వేతనాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు జమ కావడం విశేషం. పండుగ సమయంలో ఈ మొత్తాలు అందడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే కాకుండా, రాష్ట్రంలోని సుమారు 55 వేల మంది పోలీస్ సిబ్బందికి కూడా చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న సరెండర్ లీవ్ బకాయిలను విడుదల చేసింది. అలాగే నాబార్డ్, విదేశీ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.1,243 కోట్ల మేర చెల్లింపులు చేసింది. దీంతో నిలిచిపోయిన అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు మెరుగయ్యాయి.
ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి తమ సమస్యలు విన్నవించగా, సంక్రాంతి నాటికి బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆర్థిక శాఖతో సమన్వయం చేసి వేల కోట్లను విడుదల చేయడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమని NGO, ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
