మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తన కొత్త రాజకీయ పార్టీపై అధికారిక ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. తనకు సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందని, అందుకే మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో పార్టీని ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు.
సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కవిత, అక్కడి నుంచి 16 మంది బీఆర్ఎస్ నేతలు టికెట్ కోసం తమను సంప్రదించారని చెప్పారు. ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితికి నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేటీఆర్, హరీష్ రావులు ఇతర జిల్లాల్లో ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి బరిలో ఉన్న ప్రాంతాల్లోనే హరీష్ రావు ఎందుకు తిరుగుతున్నారని కూడా సందేహం వ్యక్తం చేశారు.
ఈ నెల 12న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ’ను నిర్వహిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరగనుంది.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేలా ఈ సభను నిర్వహిస్తున్నామని కవిత తెలిపారు. ఉద్యమకారుల హక్కులు, గౌరవం కోసం తెలంగాణ జాగృతి నిరంతరం పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
