తమిళనాడు బీజేపీ ముఖ్య నేత అన్నామలై ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారా. రెండు రోజులుగా ఈ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు ఖరారైనట్లు ప్రచారంలో ఉంది. ఇదే సమయంలో ఢిల్లీకి వెళ్లిన అన్నామలై పార్టీ అధి నాయకత్వాన్ని కలిసారు. అన్నామలై పార్టీ వీడరని బీజేపీ నేతలు చెబుతున్నా… జూన్ 4న తన రాజకీయ నిర్ణయం ప్రకటించేందుకు అన్నామలై సిద్దమయ్యారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
బీజేపీకి ఆ పార్టీ తమిళనాడు శాఖ మాజీ అధ్యక్షుడు అన్నామలై గట్టి షాక్ ఇవ్వటానికి సిద్దం అయినట్లు తెలుస్తోంది. బీజేపీకి గుడ్‌బై చెప్పి.. ఈ నెల 15వ తేదీ లోపు కొత్త పార్టీని ప్రకటించడంతో పాటు తిరుచ్చి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. 2011 కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఈ మాజీ ఐపీఎస్ అధికారి తన పదవికి రాజీనామా చేసి.. 2019లో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన రెండు వారాలకే రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యారు. రెండేళ్లకే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2021 జూలై నుంచి 2025 ఏప్రిల్ వరకు ఆ పదవిలో కొనసాగారు. డీఎంకే ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పెద్దఎత్తున ఉద్యమించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పళనిస్వామి హయాం వరకు జరిగిన అవినీతి చిట్టాను కూడా బయటపెట్టారు. దీంతో అన్నామలైపై ఆగ్రహించిన ఈపీఎస్.. ఆయన్ను పదవి నుంచి తొలగిస్తే తప్ప బీజేపీతో చేతులు కలపలేమని చెప్పడంతో ఆ పార్టీ అన్నామలైని పక్కనబెట్టింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు గానీ, ఆయన మద్దతుదారులకు గానీ టికెట్లు ఇవ్వలేదు.
బీజేపీ ఆ ఎన్నికల్లో 27 సీట్లు మాత్రమే తీసుకోవటం.. అన్నాడీఎంకే తో కలిసి రాజకీయ ప్రయాణం చేయటం అన్నామలైకు రుచించలేదు. కాగా.. తాజా ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అనూహ్య విజయంతో బీజేపీకి తమిళనాట భవిష్యత్ లేదని అన్నామలై నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ‘అన్నామలై అన్బు కూట్టం’ పేరుతో అన్నామలై అభిమాన సంక్షేమ సంఘం పెద్దఎత్తున అంటించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ‘నిర్భీతి మనసుకు ఎల్లలు లేవు’ అనే నినాదంతో ఇవి జిల్లా అంతటా వెలిశాయి. ‘మక్కల్ సేవై కట్చి’(ప్రజా సేవ పార్టీ) పేరుతో పాటు మరికొన్ని పేర్లు కూడా ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. కాగా.. తాజాగా బీజేపీ ముఖ్య నేతలు అన్నామలై తో టచ్ లోకి వచ్చారు. పార్టీ వీడే ఆలోచనల పైన ఆరా తీసారు. పార్టీలో భవిష్యత్ ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీ నేతల హామీలు.. మద్దతు దారుల నుంచి ఒత్తిడి వేళ అన్నామలై జూన్ 4న కీలక భేటీ ఏర్పాటు చేసుకున్నారు. అందులో తన మద్దతుదారులకు పరిస్థితులను వివరించి.. తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
