తిరుపతిలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వేలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు తిరుపతి వైసీపీ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి నేతృత్వం వహించారు.
కూటమి ప్రభుత్వ కాలంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ నిరసనకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా, నిన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఎదుట రోడ్డుపై శాంతియుతంగా నిరసన తెలిపిన వైసీపీ శ్రేణులపై 13 మందికి అట్రాసిటీ కేసులు నమోదు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘించడమేనని నేతలు మండిపడ్డారు.
నిరసన నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశముండడంతో, పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల మోహరింపు పెంచి, పరిస్థితిని అదుపులో ఉంచే ప్రయత్నం చేశారు.
నిరసనలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు నినాదాలతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో తిరుపతిలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
