విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన అనుమానాస్పద లింకులు బయటపడటం స్థానికంగా ఆందోళన కలిగించింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ముగ్గురు యువకులను అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అరెస్టు చేసిన వారిలో మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సొహైల్ బేగ్ ఉన్నారు. వీరు సోషల్ మీడియా వేదికల ద్వారా దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించే పోస్టులు పెడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితులపై యూపీఏ (UAPA), ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా మరో 10 మందితో వీరు సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. “BENX” అనే గ్రూపు ద్వారా ఉగ్ర కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ గ్రూప్ ద్వారా యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
