విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. దాదాపు ఏడు నెలల నిరీక్షణ తర్వాత సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. సుమారు మూడు గంటల నిడివితో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 12 కీలక మార్పులను సూచించింది.
సినిమాలో విజయ్ రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ప్రస్తావన ఉన్న డైలాగ్‌లను బోర్డు తొలగించమని ఆదేశించింది. అలాగే ‘అంబేడ్కర్ చట్టం’ అనే డైలాగ్‌ను ‘TVK చట్టం’గా మార్చాలని సూచించింది. ఇక ఒక పుస్తకం కవర్‌పై అంబేడ్కర్ ఉన్న విజువల్స్‌తో పాటు, భారత జాతీయ జెండా కింద పడుతున్నట్లుగా ఉన్న కీలక షాట్‌ను కూడా పూర్తిగా తొలగించాలని పేర్కొంది.
సినిమాలోని ‘రంగనాథర్’, ‘ఓం’ అనే పదాలతో పాటు, ‘ఆపరేషన్ మేలుహా’ వివరణలో వినిపించే ‘న్యూ ఇండియా’ అనే పదాన్ని మ్యూట్ చేయాలని ఆదేశాల్లో ఉంది. ఒక చిన్నారిని తగలబెడుతున్నట్లు ఉన్న విజువల్స్‌ను మార్చాలని, ‘షీలా రాణి’ అనే పేరును తొలగించాలని సూచించింది. వీటితో పాటు సద్దాం హుస్సేన్ ఉరితీతకు సంబంధించిన డైలాగ్‌ను కూడా మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. సినిమాలోని మరికొన్ని సన్నివేశాల్లో అభ్యంతరకర పదాలను మ్యూట్ చేయాలని ఆదేశించింది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం కోసం విజయ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించగా, మమితా బైజు మరో కీలక పాత్రలో కనిపించనుంది. సెన్సార్ పనులు ముగియడంతో, జూలై 24న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
