తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. ఎన్నికలకు ముందు కరూర్ లో విజయ్ సభ కోసం వచ్చిన వారిలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పుడు సీఎం హోదాలో వారికి ఉద్యోగ నియామక పత్రాలను విజయ్ అందించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్‌లో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనలో 41 మంది మరణించారు. ఆ సమయంలోనే తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన విజయ్.. తక్షణ సహాయం కింద మరణించిన వారి కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20 లక్షల చొప్పున జమ చేసి పెద్ద మనసు చాటుకున్నారు. ఆ తర్వాత వారందరితో వర్చువల్ గా మాట్లాడి ధైర్యం చెప్పారు. తాజాగా ఆ కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలనే సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేస్తూ, నియామక పత్రాలను స్వయంగా బాధితుల చేతుల్లో పెట్టారు.
ఉద్యోగ పత్రాల అందజేత సందర్భంగా సీఎం విజయ్ బాధితులను ఆత్మీయంగా పరామర్శించారు. ప్రమాదంలో కుటుంబ పెద్దలను, ఆసరాను కోల్పోయిన వారికి ఈ ప్రభుత్వ ఉద్యోగం కొంతైనా ఆర్థిక భరోసానిస్తుందని ఆయన పేర్కొన్నారు. నాడు విపక్షంలో ఉన్నా, నేడు అధికార పీఠంపై ఉన్నా బాధితులకు అండగా ఉంటానన్న హామీని సీఎం నెరవేర్చడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై తమిళనాట రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ కార్యక్రమానికి ముందు మద్రాస్ హైకోర్టు ఈ ఉద్యోగాల పంపిణీ కార్యక్రమానికి అనుమతినిచ్చింది. అయితే, ఈ నియామకాలపై కోర్టు ఒక కీలకమైన షరతును విధించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంటూనే, ఈ నియామకాలు ప్రస్తుతానికి ‘తాత్కాలికం’ మాత్రమేనని స్పష్టం చేసింది.
