భాకరాపేట సమీపంలో ఉప్పల వంక వద్ద ఎర్రబండ్ల వద్ద టాస్క్ ఫోర్స్ పోలీస్ లు 17 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబందించిన జవ్వాది మలైకు చెందిన శెల్వరాజ్ ను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ ఐ భాస్కర్ రావ్ రాత్రి శ్రీవారిమెట్టు నుంచి కల్యాణీ డ్యామ్ మీదుగా కూంబింగ్ చేపట్టారు.
భాకరాపేట అడవులలో వెళుతుండగా 20 మంది స్మగ్లర్లు తారస పడ్డారు. దీంతో అపత్తమైన టాస్క్ ఫోర్స్ వారిని వెంబడించారు. స్మగ్లర్లు రాళ్ల దాడికి దిగారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారికి తుపాకులు చూపించి ఎక్కు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో స్మగ్లర్లు పారిపోగా శెల్వరాజ్ దొరికి పోయాడు. ఈ ప్రదేశం లో దాదాపు ఒక టన్ను గల 17 ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇతన్ని విచారించగా వేలూరు నుంచి సురేష్ అనే వ్యక్తి తమను తీసుకుని వచ్చినట్లు చెప్పాడని డీఎస్పీ హరనాథ్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ వీరు వారం రోజుల క్రితం పాకాలకు వచ్చారని అన్నారు.
అక్కడ నుంచి రెండు రోజులు ప్రయాణించి కడప అడవులకు చేరుకున్నట్లు తెలిపారు. దుంగలను కొట్టుకుని తిరిగి వచ్చి ముంగిలిపట్టు వద్ద లోడింగ్ పాయింట్ కు వస్తుండగా టాస్క్ ఫోర్స్ కంట పడ్డారని తెలిపారు. తాము కిలో 500 రూపాయలు చొప్పున విక్రయిస్తామని చెప్పారన్నారు. వీరి నుంచి రెండవ స్టేజి స్మగ్లర్ అధిక ధరకు మూడవ స్థాయి స్మగ్లర్ కు విక్రయిస్తాడని అన్నారు. ఈ బృందం లో ఎఫ్ ఎస్ ఒ ఎవి సుబ్బారావు హరి కృష్ణ శ్రీకాంత్ ఆంజనేయులు దిలీప్ నాగేంద్ర ఉన్నారు.
