ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతోనే తెలుగునాట కాంగ్రెస్ ప్రస్థానం బీటలు వారడం మొదలైంది. ఢిల్లీ అధిష్టానం మొండిగా……మూర్ఖంగా తీసుకున్న నిర్ణయాలతో మరీ కునారిల్లిపోయింది. అధికారంలో ఉన్నారా లేరా అనేదానితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలకు దూరమవుతూనే వచ్చింది. అలాంటి పార్టీకి మళ్ళీ ప్రాణం పోసిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సమున్నతంగా ఎదిగింది. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమయ్యాడు వైఎస్సార్. అయితే తెలంగాణాలో ఉన్న కొంతమంది పిపీలికంలాంటి నాయకులు మాత్రం వైఎస్ వెలుగును తాము కూడా పంచుకుంటున్నామన్న విషయం మర్చిపోయి స్వయం ప్రకాషితాలు అన్నట్టుగా రెచ్చిపోయారు. మధుయాష్కీ, వీహెచ్, కేకేలతో సహా చాలా మంది నాయకులు వైఎస్‌కంటే గొప్పవాళ్ళం అనేస్థాయిలో రెచ్చిపోయారు.
వైఎస్ చనిపోయిన తర్వాత వైఎస్ పై ఉన్న కోపాన్ని జగన్‌పై చూపించారు. అమానవీయంగా ప్రవర్తించారు. తెలుగుదేశం, పచ్చ మీడియా డ్రామాలో పావులుగా మారిపోయి వైఎస్ కుటుంబాన్ని మాటలతో హింసించారు. సోనియాకు లేనిపోని కహానీలు చెప్పి వైఎస్‌లకు పార్టీలో స్థానం లేకుండా చేశారు. లగడపాటి లాంటి సీమాంధ్ర నాయకులు కూడా ఈ కుట్రలలో భాగమైనప్పటికీ తెలంగాణా నాయకులే ప్రధాన పాత్ర పోషించారు. 2009లో పార్టీ అధికారంలోకి రావడానికి మేం కూడా కారణమని డిఎస్ లాంటివాళ్ళు గొప్పగా ప్రకటనలు చేశారు.
కట్ చేస్తే 2014ఎన్నికలు వచ్చాయి. మహా నాయకులం అనుకున్న తెలంగాణా నాయకులందరికీ భవిష్యత్తు లేకుండాపోయింది. సోనియా గాంధీ తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురాలేకపోయారు.వైఎస్ సాధించిన అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నంత కాలం గొప్ప గొప్ప నాయకులుగా చెలామణి అయిన తెలంగాణా కాంగ్రస్ నాయకులు అందరూ ఇప్పుడు జాలి చూపులు చూస్తున్నారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకుడు లేడు. మీడియా ముందు మాట్లాడే నాయకులే తప్ప ప్రజాక్షేత్రంలో ప్రజలను స్పందింపచేసే స్థాయిలో మాట్లాడే నాయకుడు ఒక్కడు కూడాలేడు. అందుకే కాంగ్రెస్ పార్టీ నానాటికీ బలహీనపడుతోంది. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ దుస్థితి తలుచుకుని బాధపడిన తెలంగాణా కాంగ్రస్ నాయకులు….‘వైఎస్సార్ దేవుడు’ అంటూ వైఎస్ గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ ప్రజలను కదిలించిన విధానం, ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ గుర్తు చేసుకుని ఆవేధన చెందారు. అధికారంలో ఉన్నంత కాలం ఆ అధికారం ఎవరి వళ్ళ వచ్చింది అన్న విషయం మరిచిపోయి అధికారం కోల్పోయాక ఎంత జ్ఙానోదయం అయితే మాత్రం ఏముందని ……..అంతా కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని అదే కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్ అభిమానులు ఆవేధనగా మాట్లాడుకోవడం కనిపించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోయేలా చేసినప్పటికీ సొంత పార్టీ పెట్టుకున్న జగన్ 2014ఎన్నికల్లో చంద్రబాబు, పవన్, మోడీలకు ఎదురొడ్డి మరీ భారీ స్థాయిలో ఓట్లు, సీట్లు గెలుచుకున్నాడు. బలమైన ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డాడు. సొంత ప్రభ అంటే అలా ఉంటుంది. తెలంగాణా రాష్ట్రం ఇచ్చినప్పటికీ కనీస స్థాయిలో కూడా ప్రజల ఆదరణ చూరగొనలేకపోయారు తెలంగాణా కాంగ్రెస్ నాయకులు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్ ఒక్కడి వళ్ళే అధికారంలోకి రాలేదు……..మేమూ కష్టపడ్డాం……మేం కూడా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉన్నవాళ్ళమే అని చెప్పుకున్న కొంతమంది తెలంగాణా సీనియర్ నాయకుల అసలు సత్తా ఏంటో సోనియాకు తెలిసొచ్చేలా చేశారు. అందుకే ఇప్పుడు పార్టీ సర్వనాశనం అయ్యాక అంతర్గత సమావేశాల్లో వైఎస్సార్ గొప్పతనం గుర్తొస్తోంది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు. అందుకేనేమో ….జాతీయ స్థాయిలో కూడా కాంగ్రస్ పార్టీ గురించి ఒక నానుడి ఉంటుంది. కాంగ్రెస్‌ని వేరే వాళ్ళు ఓడించాల్సిన అవసరం లేదు…….వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు అని.
