భారత నావికాదళం నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ సునీల్ లాంబా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ వెస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా ఉన్న ఆయన మంగళవారం నాడు కొత్త బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ ఈ ఉన్నత పదవిలో అడ్మిరల్ ఆర్.కె.ధావన్ ఉన్నారు, ఆయన సోమవారం నాడు పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్ధానంలో సునీల్ లాంబాను కేంద్రం కొత్త అధికారిగా నియమించింది.
దేశానికి ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా జలాంతర్గాములు, నౌకలు, విమానాలు సన్నద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా లాంబా అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో 50 దేశాలు పాల్గొనడం వల్ల మన దేశానికి ఉన్న ప్రాధాన్యం పెరిగిందని అన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు భారత నావికాదళంతో కలిసి పని చేయడానికి ముందుకు వస్తున్నాయన్నారు. భారత నావికా దళంలో 1978 జనవరి 1 న ఎగ్జిక్యుటివ్ బ్రాంచ్ లో చేరిన సునీల్ లాంబా అంచెలంచెలుగా ఎదిగారు.
