ప్రముఖ తెలుగు సినీ దర్శకులు కోడి రామకృష్ణ అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం తనువు చాలించారు. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇప్పటికే పినీ పెద్దలు ఆయన మృతికి సంతాపం తెలిపారు. టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాని స్పందించారు
హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ, ‘తెలుగు సినిమా’ ఓ లెజెండ్ ను కోల్పోయిందని అన్నారు. హీరో కల్యాణ్ రామ్ స్పందిస్తూ కోడి రామకృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
దర్శకుడు కోడి రామకృష్ణ ఇకలేరనే వార్త తనను ఎంతగానో బాధించిందని మహేష్ బాబు ట్వీట్ చేశారు. తెలుగు సినిమాకు రామకృష్ణ చేసిన సేవ అసాధారణమని, ఆయన సేవను ఇండస్ట్రీ ఎప్పటికీ మరవదని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
అలాగే హీరో నాని కూడా ట్వీట్ చేశారు. ఆయన తరంలో రామకృష్ణ ఎంతో ప్రశాంతత కలిగిన వ్యక్తని పేర్కొన్నారు. ఈరోజు హెడ్ బ్యాండ్ తన ఆధారాన్ని కోల్పోయిందని, అలాగే మనం ఒక దిగ్గజాన్ని కోల్పోయామని నాని తన ట్వీట్‌లో వెల్లడించారు.
