హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉప్పుగూడ–Charminar పరిసరాల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్‌టీఎఫ్ సంయుక్త దాడుల్లో గంజా కలిపిన చాక్లెట్లు స్వాధీనం అయ్యాయి. ఈ చాక్లెట్లను తండాయ్‌లో కలిపి అధిక ధరలకు విక్రయిస్తున్న రాకెట్‌ను అధికారులు బయటపెట్టారు.
అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ తండాయ్ గ్లాస్ ధర ₹50,గంజా కలిపిన తండాయ్ గ్లాస్ ధర ₹150 . డిమాండ్ పెంచేందుకు గంజా కలిపిన చాక్లెట్లను పానీయంలో మిక్స్ చేశారు. వేసవి కాలంలో తండాయ్ వినియోగం అధికంగా ఉండటంతో కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఉప్పుగూడలోని ఓ నివాసంలో ఎస్‌టీఎఫ్ బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 1,920 గంజా చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 9.60 కిలోల గంజా చాక్లెట్లలో కలిపినట్లు గుర్తించారు. ప్రతి చాక్లెట్‌లో సుమారు 5 గ్రాముల గంజా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పండుగలు, సీజనల్ సమయాల్లో డిమాండ్ పెరిగినప్పుడు అధిక లాభాల కోసం ఈ మత్తు పదార్థాల ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆహార పదార్థాల్లో అక్రమ మత్తు పదార్థాలు కలపడం తీవ్రమైన నేరమని అధికారులు హెచ్చరిస్తూ, ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
