విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో చోటుచేసుకున్న ఒక వింత ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాక్షాత్తు అమ్మవారి సన్నిధిలోనే నకిలీ పత్రాలతో ఒక వ్యక్తి అర్చకత్వం కోసం ప్రయత్నించడం భక్తులను, అధికారులను విస్మయానికి గురిచేసింది.
ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో భద్రత మరియు అధికారిక పరిశీలనల డొల్లతనాన్ని బయటపెడుతూ ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అర్చకుడిగా పనిచేయడం కోసం ఓ వ్యక్తి ఏకంగా నకిలీ పత్రాలను సృష్టించి అధికారులకే బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. దుర్గగుడిలో సాయి బాబు అనే అర్చకుడు గతంలో విధులు నిర్వహించేవారు. ఆయన 2022లో మరణించారు. సాధారణంగా అర్చక కుటుంబాల్లో వారసత్వంగా లేదా ఖాళీలు ఏర్పడినప్పుడు నిబంధనల ప్రకారం భర్తీ జరుగుతుంది. ఈ అవకాశాన్ని వాడుకోవాలని భావించిన దిలీప్ అనే వ్యక్తి రంగంలోకి దిగాడు.
మరణించిన సాయి బాబు స్థానాన్ని తనే భర్తీ చేయాలని భావించిన దిలీప్, అందుకు తగ్గట్టుగా నకిలీ దేవాదాయ శాఖ పత్రాలను, అర్హత ధృవీకరణ పత్రాలను సృష్టించాడు. ఈ డాక్యుమెంట్లను సమర్పించి అధికారులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ పత్రాల పరిశీలన సమయంలో అధికారులకు అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది. ఆ పత్రాలన్నీ ఫోర్జరీ చేసినవని తేలడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు.
అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటన జరగడంపై భక్తులు మండిపడుతున్నారు.దేవాదాయ శాఖలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఎంత బలహీనంగా ఉందో ఈ ఘటన నిరూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.ఒక బయటి వ్యక్తి ఇంత ధైర్యంగా నకిలీ పత్రాలతో ఆలయంలోకి చొరబడాలని చూడటం భద్రతా వైఫల్యమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
