సాతాంకుళం కస్టడీ మరణాల కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 9 మంది పోలీసులకు మరణదండన విధించింది. ఈ తీర్పు రావడానికి దాదాపు 6 సంవత్సరాలు పట్టింది. 2020లో తూత్తుకుడి జిల్లా సాతాంకుళంలో పి. జయరాజ్ మరియు అతని కుమారుడు జె. బెన్నిక్స్ ను పోలీసులు తీవ్రంగా కొట్టడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించి మొబైల్ షాప్ తెరిచి ఉంచారనే ఆరోపణలతో జూన్ 19, 2020న జయరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి గురించి అడగడానికి వచ్చిన బెన్నిక్స్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరినీ రాత్రంతా తీవ్రంగా హింసించారు.
బెన్నిక్స్ జూన్ 22న గాయాల కారణంగా మరణించగా, జయరాజ్ జూన్ 23న మరణించాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవడంతో మధురై బెంచ్ ఆఫ్ మద్రాస్ హైకోర్టు స్వయంగా విచారణకు తీసుకుంది. తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి 90 రోజుల్లోనే 9 మంది పోలీసులపై చార్జ్ షీట్ దాఖలు చేసింది.
మదురైలోని అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి జి. ముత్తుకుమారన్ ఈ కేసును “అత్యంత అరుదైన అరుదైన కేసుగా పేర్కొన్నారు.ప్రజలను రక్షించాల్సిన పోలీసులు ఇలాంటి దారుణానికి పాల్పడటం సమాజాన్ని కుదిపేసిందని కోర్టు పేర్కొంది.తండ్రి, కొడుకును ఒకేసారి చంపడం ద్వారా కుటుంబం మూలాలను నాశనం చేశారని వ్యాఖ్యానించింది.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన శిక్ష అవసరమని స్పష్టం చేసింది
9 మంది పోలీసులకు మరణదండన
మొత్తం ₹1.40 కోట్లు జరిమానా (పరిహారంగా బాధిత కుటుంబానికి)
దోషుల్లో మాజీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్, హెడ్ కానిస్టేబుళ్లు మురుగన్, సామిదురై తదితరులు ఉన్నారు. ఈ కేసులో మొత్తం 105 మంది సాక్షులను విచారించారు. మొదట 10 మంది నిందితులు ఉండగా, ట్రయల్ సమయంలో ప్రత్యేక సబ్ ఇన్‌స్పెక్టర్ పాల్‌దురై ఆరోగ్య సమస్యలతో మరణించారు.
