హత్య చేసిన కొడుకును పోలీసులకు పట్టించింది ఓ తల్లి. మద్యం మత్తులో స్నేహితుడిని హతమార్చారు ఇద్దరు యువకులు. నిందితుల్లో ఒకరు తల్లికి విషయం తెలపగా పోలీసులకు అప్పగించింది తల్లి.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మేడిపల్లి గ్రామంలో మద్యానికి బానిసలుగా మారారు రాగీరు మధు(25), గాంధారి చరణ్, ఊట్ల నవీన్ అనే ముగ్గురు స్నేహితులు.మధు తరచూ మద్యం మత్తులో ఉంటూ ఎలాంటి పని చేయకుండా రెండు రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లేవాడని, చరణ్ అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసేవాడని, నవీన్ ఆటో నడిపేవాడని తెలిపారు స్థానికులు.
శుక్రవారం ఉదయం మద్యం మత్తులో ఇంటికి వచ్చి తాను మధును హత్య చేసి చెరువు సమీపంలోని ఇసుక దిబ్బలో ఉన్న గడ్డిలో పాతి పెట్టానని తల్లికి తెలిపారు చరణ్.దీంతో తన కొడుకును పోలీసులకు అప్పగించింది చరణ్ తల్లి.
పోలీసులు విచారణలో ఈ నెల 21వ తేదీన సాయంత్రం మేడిపల్లి ప్రభుత్వ పాఠశాల వెనుక తాను, మధు, నవీన్ కలిసి మద్యం సేవించామని, మధు తమతో వాగ్వాదానికి దిగడంతో అతని తలపై రాడ్డుతో కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడని తెలిపింది చరణ్.అనంతరం విషయం బయటికి రాకుండా ఉదయం 4 గంటల సమయంలో శామీర్‌పేట్ వాగు వద్దకు తీసుకెళ్లి అక్కడే ఉన్న ఇసుక దిబ్బలో పాతి పెట్టినట్లు పోలీసులకు చరణ్ వివరణ ఇచ్చారు.
మధుకు రెండు మూడు రోజులైనా ఇంటికి రాకుండా ఉండే అలవాటు ఉండడంతో, కొడుకు కనిపించకున్నా ఆచూకీ కోసం వెతకలేదు తల్లిదండ్రులు. కొడుకు మరణించాడని పోలీసులు తెలపడంతో శోకసంద్రంలో మునిగారు మధు తల్లిదండ్రులు.నిందితుల్లో ఒకరైన చరణ్‌ను అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న నవీన్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.
