మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల, జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. తొమ్మిదో తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థులను ఇంటర్ సెకండియర్ విద్యార్థులు తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. థమ్సప్ బాటిల్ విషయంలో మొదలైన చిన్నపాటి వాగ్వాదం పెద్ద ఘర్షణగా మారిందని తెలుస్తోంది.
సాక్షుల కథనం ప్రకారం, థమ్సప్ ఎవరికి ఇవ్వాలన్న విషయంపై మాటామాటా పెరిగి, సీనియర్ విద్యార్థులు జూనియర్‌లపై దాడికి దిగారు. గదుల్లోకి తీసుకెళ్లి బెదిరింపులకు గురిచేసి, దారుణంగా చితకబాదినట్లు బాధితులు తెలిపారు. కొందరు విద్యార్థులకు గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన తెలిసిన వెంటనే బాధితుల తల్లిదండ్రులు గురుకులం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం వహించారని పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గురుకులానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చింది.
