మహబూబాబాద్ జిల్లా మహమూద్‌పట్నం గ్రామం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు వేదికగా మారింది. తాజాగా తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన రిజర్వేషన్ జాబితాలో గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు సభ్యులకు మొత్తం నాలుగు కీలక స్థానిక పదవులు వరించే పరిస్థితి నెలకొనడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈసారి సర్పంచ్ పదవి తో పాటు మూడు వార్డులకు గిరిజనులకు (ST) రిజర్వేషన్ కేటాయించబడింది. గ్రామంలో ST జనాభా ప్రధానంగా రెండు బంధువుల కుటుంబాలకు మాత్రమే పరిమితమై ఉండటం వల్ల, ఈ నాలుగు పదవులు కూడా వారికే దక్కే అవకాశం బలంగా కనిపిస్తోంది. దీంతో గ్రామంలో రాబోయే పంచాయతీ ఎన్నికలు కుటుంబ అంతర్గత పోటీలా మారే అవకాశం ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒకే గ్రామంలో రెండు కుటుంబాలకు వరుసగా నాలుగు పదవులు రాబోతోన్న నేపథ్యం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రిజర్వేషన్ వ్యవస్థ ఉద్దేశం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడం అయినప్పటికీ, ఈ గ్రామంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితి ఆ రెండు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. గ్రామంలో ఇప్పుడు ఎవరెవరు పోటీ చేస్తారు? కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అంగీకారం ఉంటుందా? లేకపోతే అంతర్గత పోటీ తీవ్రంగా మారుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
