భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 2003లో అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన మిశ్రా.. 2017 వరకు భారత తరఫున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టి20 మ్యాచ్‌లు ఆడారు. 2024 ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున చివరి మ్యాచ్ ఆడారు.
25 ఏళ్లుగా క్రికెట్ ఆడాను. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలతో, ఎంఎస్ ధోనీ వంటి నాయకత్వంలో, రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడాను. క్రికెట్ నాకు గౌరవం, గుర్తింపు, జీవితానికి అర్థం ఇచ్చింది. నేను పొందిన ప్రతీ అవకాశాన్ని హృదయపూర్వకంగా ఉపయోగించుకున్నాను అని మిశ్రా అన్నారు.
ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం క్యాపిటల్స్), డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో జట్లకు ప్రాతినిధ్యం వహించిన మిశ్రా, 2008 నుంచి 2024 వరకు దాదాపు ప్రతి సీజన్ ఆడారు. మొత్తం 162 మ్యాచ్‌ల్లో 174 వికెట్లు తీశారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హ్యాట్రిక్‌లు (మూడు) తీసిన బౌలర్‌గా రికార్డు సొంతం చేసుకున్నారు.
2008లో తీసిన హ్యాట్రిక్ నా కెరీర్ మలుపు. ఆ ఐపీఎల్ ప్రదర్శనతోనే తిరిగి టీమిండియాలో చోటు సంపాదించాను అని ఆయన గుర్తుచేసుకున్నారు.హర్యానాకు చెందిన మిశ్రా 2000-01లో ఫస్ట్‌క్లాస్ ఆరంగేట్రం చేశారు. 2003లో దక్షిణాఫ్రికాపై డాకాలో వన్డే డెబ్యూ చేశారు. 2008లో మొహాలీలో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసి ఐదు వికెట్లు తీశారు. అయితే హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే లాంటి బౌలర్ల కారణంగా ఆయనకు సుదీర్ఘ అవకాశాలు లభించలేదు.
మొత్తం మీద మిశ్రా 152 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 535 వికెట్లు, 152 లిస్ట్‌ఏ మ్యాచ్‌ల్లో 252 వికెట్లు, 259 టి20ల్లో 285 వికెట్లు తీశారు. 2012 రంజీ ట్రోఫీలో కర్ణాటకపై అజేయ 202 పరుగులతో డబుల్ సెంచరీ కూడా సాధించారు.
